15, మే 2016, ఆదివారం

Tender Coconut

మండే ఎండల నుంచి ఉపశమనం కల్గించే ఒక దివ్యఔషధం కొబ్బరిబొండం. అస్వస్థతకు గురైన రోగులకు వైద్యుల సహాయం లేకుండా తక్షణ శక్తిని ప్రసాదించే ఒక సిలైన్‌. ఆబాల గోపాలానికి తీపిరుచులందించే ఒక అరుదైన పానీయం. 



అందుకే కొబ్బరిబొండం.. యావత్‌ మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సంజీవని. ప్రచండ భానుడి ప్రతాపానికి ఇబ్బందిపడుతున్నవారికి ఇది దాహం తీర్చడమే కాదు ఎన్నో పోషకాలందించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉండే సహజసిద్ద నీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని గతం  నుంచి  వైద్యులు ప్రధానంగా ఈ కొబ్బరిబొండాలను సిఫార్సు చేస్తున్నారు. వడగాల్పులకు గురైనవారు తక్షణం ఈకొబ్బరి బొండం నీరు త్రాగడం చేత కోలుకోగలుగుతున్నారు. ఏడాది పొడవునా ఈ కొబ్బరిబొండాల వినియోగం ఉన్నప్పటికీ ఈ వేసవిలో మాత్రం రోజుకు ఒక్కసారైనా దీన్ని సేవించడం పరిపాటిగా మారింది. అందుకనే పట్టణాల్లోనే కాక పల్లెల్లోనూ ఈ కొ బ్బరిబొండాల వినియోగం విపరీతంగా పెరిగింది. 

 మన పూర్వీకులు చెప్పినట్లు కొబ్బరిచెట్టు నిజంగానే కల్పవృక్షం. ఎందుకంటే జీవించడానికి అవసరమైన నీరు, ఆహారం, ఆవాసం, ఉపాధి కల్పిస్తుంది. ఈ చెట్టులో ప్రతీభాగం ఉపయోగమైనదే. దీనిలో వ్యర్ధమన్నదే ఉండదు. ఇంటి ఆవరణలో ఏమాత్రం జాగా ఉన్నా ఈ కొబ్బరిచెట్టును పెంచుతూ ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో కొ బ్బరిదే పెద్దపీట. పూజాపురస్కారాల్లో, యజ్ఞయాగాదుల్లో నారీకేళం పగలాల్సిందే.. ఆ నీటితో అభిషేకించాల్సిందే. మిగిలిన భాగాల సంగతి ఎలాగున్నా కొబ్బరినీరు, కొ బ్బరిబొండాలు, కాయల వినియోగం ప్రధానంగా ఉంటుంది. 

బొండం కాయగా పెరిగేకొద్దీ అందులో యాంటీఆవ్లూల శాతం మారుతూ ఉంటుంది. అందుకే ఆయుర్వేద నిపుణులు దీన్ని బాల, మధ్య, పక్వ అని మూడుదశలుగా విభజించారు. 

బాల (లేత) కొబ్బరిబొండాల్లో 90 నుండి 95శాతం నీరే ఉంటుంది. ఒంటిని చల్లబర్చే గుణాలు ఇందులో ఎక్కువ. ఇది జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది.ఈ నీళ్ళలోని తీపిగుణం ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. 

కాస్త లేత కొబ్బరి కట్టినదే మధ్యవయసు బొండం. ఇందులో నీళ్ళలో పోషకాలశాతం ఎక్కువ. పిండిపదార్ధాలు, ఖనిజాలు, ఫాస్పరస్‌, విటమిన్‌ ఏ, బీ, సీలు మిగిలిన రెండింటిలో కంటే ఎక్కువగా ఉంటాయి. 

కొబ్బరి బాగా కట్టినదే పక్వదశ. జీర్ణశక్తి సరిగా లేనివారు ఈ దశలోని కొబ్బరి ఎక్కువగా తినడం మంచిది కాదు. 
అందుకనే మూడింటిలోనూ లేత, మధ్యవయసు బొండాలే శరీరంలోని వివిధ రకాల ఖనిజాల పనితీరుకు తోడ్పడతాయి. 

సహజ సిలైన్‌ కొబ్బరిబొండం ఎమర్జెన్సీ గ్లూకోజ్‌ కూడా. ప్రపంచ యుద్దంలో అత్యవసర సమయంన ందు గ్లూకోజ్‌కు బదులుగా కొబ్బరినీళ్ళను నింపి ఇంజక్ట్‌ చేసేవారంట. ఇప్పటికీ సిలైన్ అందుబాటులో లేని దేశాల్లో వీటినే బాటిల్స్‌లోకి నింపి వాడతారట. ఎందుకంటే ఇవి సహజంగానే స్టెరిలైజ్డ్‌ మినరల్‌ వాటర్‌. ఎలాంటి మలినాలు, సూక్ష్మజీవులు ఉండవు. వెంటనే రక్తంలో కలిసి ప్లాస్మాలా పనిచేస్తుంది. అందుకనే పెద్దలు ఎంగిలి కాని నీరుగా చెబుతారు. గ్యాస్ట్రోఎంటరైటీస్‌ రోగులకు దీన్ని ఇంజక్ట్‌గా చేయడంవల్ల సిలైన్‌కంటే బాగా పనిచేస్తుంది. అయితే కొన్ని దేశాల్లోనే కాక మన దేశంలో కూడా కొబ్బరిబొండాల నీరును కవర్లు, టిన్‌ల్లో ప్యాకింగ్‌ చేసి విక్రయాలు జరుపుతున్నారు. అయితే నేరుగా కొబ్బరిచెట్టు నుండి తీసిన బొండాలను తాగినప్పుడు ఉండే పోషకాలు ఈ ప్యాకింగ్‌వల్ల కాస్త తగ్గే అవకాశాలుంటాయి.

ఆరోగ్యపరంగా.. అనేక రోగాలనుంచి ఈ కొబ్బరిబొండాలు ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ బొండం సేవించడంవల్ల కామెర్లు, యూరినల్‌ డిసీజెస్‌, క్యాన్సర్‌, కిడ్నీలో రాళ్లు, వడదెబ్బ, శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం, శరీరంపై వచ్చే పెలుసు వంటి వాటికి ఈ కొబ్బరిబొండం నీరు ఎంతో ఔషధంగా  పనిచేస్తుంది. 

కొబ్బరినీటిలో పోషకాలు.. 

వంద గ్రాముల లేత కొబ్బరినీళ్ళలో శక్తి 17.4శాతం, నీరు 95.5శాతం, కార్బోహైడ్రేట్‌లు 4.4శాతం, ప్రోటీన్‌లు 0.01శాతం, క్రొవ్వు 0.01శాతం, నైట్రోజన్‌ 0.05శాతం, ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ 0.56శాతం, పొటాషియం 290 మి.గ్రా., కాల్షియం 44 మి.గ్రా., సోడియం 42 మి.గ్రా., మెగ్నీషియం 10మి.గ్రా., ఫాస్ఫర్‌ 9.2మి.గ్రా., ఐరన్‌ 106 మి.గ్రా., కాపర్‌ 26 మి.గ్రా. ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి