11, మే 2016, బుధవారం

Mullapudi Harischandra Prasad (అంధ్ర పారిశ్రామికరంగ ఆద్యుడు - పారిశ్రామిక విప్లవ కెరటం - ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్)

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహా మనీషి. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురము మండలం పెదపట్నం లో 1921, జూలై 8 న చిట్టూరి జమీందారీ వంశములో, ముళ్ళపూడి తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్య (ఎస్ ఎస్ యల్ సి) పూర్తి చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (ఆగస్ట్ 11, 1947) తణుకు లో ఆంధ్రా సుగర్స్ స్థాపించాడు. అంచలంచెలుగా విస్తరింపబడిన ఈ పరిశ్రమ ఒరవడి కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, క్లోరీన్, హైడ్రోజెన్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, సూపర్ ఫాస్ఫేట్, రాకెట్ ఇంధనము మొదలగు ఉత్పత్తులకు దారి తీసింది. గుంటూరులో నూనెలు, హైడ్రాజినేటెడ్ నూనెలు తయారీ. తాడువాయి, భీమడోలు, కొవ్వూరు, సగ్గొండ లలో వివిధ కర్మాగారాలు.




కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడు కలిస్తే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌. ఆయన తణుకులో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివారు. అంధ్ర పారిశ్రామిక రంగానికి ఆద్యుడు. 24 ఏళ్ల వయసులో 1947 ఆగస్టులో తణుకులో ఆంధ్రా షుగర్స్‌ పరిశ్రమను స్థాపించారు. అప్పట్లో జనసంచారంలేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసం. మొదట్లో రోజుకు 600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో స్థాపించిన కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగి 6 వేల టన్నులకు చేరేలా కృషి చేశారు. ప్రారంభంలో 350 మందితో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్‌ నేడు 12,000 మందికి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పథంలో మరింతగా సాగుతోంది. ఆ తర్వాత కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌ తయారీ ప్లాంటును 1960లో స్థాపించారు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంటులను 1960లో స్థాపించారు. 1984లో తణుకులోనే ర్యాకెట్‌ ఇంధన ప్లాంటును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ చేతుల మీదుగా ప్రారంభింప చేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లారు. గుంటూరులో ఆయన నూనె గింజలు, బియ్యం, తవుడు ముడిపదార్థాలుగా తయారు చేసే నూనెలు, హైడ్రోజనేట్‌ అయిల్స్‌ తయారుచేసే ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రా బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ పల్లెటూరి రైతువారీ పెద్దమనిషిగా, సాదాసీదాగా కనిపిస్తారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ స్థాపించినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారో 91 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతే ఆసక్తితో పని చేస్తూ వచ్చారు. హరిశ్చంద్రప్రసాద్‌ ఏక సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంఘాలల్లో సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు.

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. తణుకులో ఆయన వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ కళాశాల, ట్రస్ట్‌ ఆసుపత్రి, ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్‌ లైబ్రరీ స్థాపించారు. రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడ తపోవనం, జూబ్లీహిల్స్‌లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.

హరిశ్చంద్ర ప్రసాద్ సెప్టెంబరు 3, 2011 న హైదరాబాదులోని బంజారా కేర్ వైద్యశాలలో మరణించాడు.


ఆంధ్రా షుగర్స్‌ పరిశ్రమ ప్రత్యేకతలు


  • గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ.


  • గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదు.



  • 1947లో రోజుకి 600 టన్నుల చెరకు Crushing తో మొదలయ్యి ప్రస్తుతము 10,000 టన్నులు Crushing  చేరింది.



  • దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ.



  • ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత.



  • భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి