30, మే 2016, సోమవారం

నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (4)



బాపు-రమణ 
బాపు-రమణ ఈ జంట గురించి తెలియనివారు వుండరు. సాహితీ రంగంలో మరియు తెలుగు సినిమా రంగంలో వీరిద్దరి సేవలు మరపురానివి. తూర్పుగోదావరి  జిల్లాలో పుట్టిన  ముళ్ళపూడి వెంకటరమణ (రమణ), పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఎక్కడ, ఎప్పుడు కలిసారోగాని గొప్ప జంటగా పేరుగాంచారు.  ఇద్దరిది విడదీయరాని బంధం. హైస్కూల్ విద్య నుంచి మిత్రులైన బాపురమణలు చివరి వరకూ కలిసే ఉన్నారు. ముళ్లపూడి మరణించాక తన సగం ప్రాణం పోయిందన్నారు బాపు . బాపురమణలు గోదావరి తీరానికి అటూ, ఇటూ గట్టి వారధిలా నిలిచి ఉభయ గోదావరి జిల్లాల మైత్రి భందాన్ని మరింత బలపరిచారు. స్నేహానికి అర్ధాన్ని నిర్వచించారు.  


సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు)

బాపుకు తెలిసినవి రెండే.. ఒకటి బొమ్మలు గీయడం, రెండు సినిమాలు తీయడం. ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించిన ఆయనను  పద్మశ్రీ బిరుదుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బాపు అసలు పేరు  సత్తిరాజు లక్ష్మినారాయణ. పశ్చిమ గోదావరిజిల్లా,నరసాపురంలో  1933డిసెంబర్ 15న జన్మించిన ఆయన మద్రాసు పిఎన్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. అప్పుడే  ముళ్ళపూడి వెంకటరమణ ఆయనకు బాల్యమిత్రుడయ్యారు. బాపు, వారపత్రికలకు చిత్రాలు వేసేవారు. బుడుగు, గిరీశం, బుచ్చమ్మలు ఎంతో పేరు పొందాయి. 

వీరిద్దరూ  1987లో ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రాధమిక వీడియో విద్యకు పాఠాలు రూపొందించారు. "సాక్షి" సినిమాతో 1967లో సినిమా రంగంలో ప్రవేశించారు.  సాక్షి సినిమాని పులిదిండి, లొల్ల గ్రామాల్లో షూటింగ్ చేసారు. . సీతా కళ్యాణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, సంపూర్ణ రామాయణం, పెళ్ళిపుస్తకం, రాధాగోపాలం ఇలా అనేక సినిమాలు తీశారు. ఎన్నో సినిమాలకు నంది అవార్డులు, జాతీయ అవార్డులు లభించాయి. ఈ సినిమాలన్నీ బాపురమణ ధ్వయమే రూపొందించింది. చివరిలో ఆయన శ్రీరామరాజ్యం సినిమా తీశారు. 2013లో దివంగతులయ్యారు. 

ముళ్ళపూడి వెంకటరమణ(రమణ)

1931జూన్ 28న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జన్మించారు. వీరిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. 9ఏళ్ళ వయసులో తండ్రి మరణించడంతో, మద్రాసు చేరుకున్నారు. అక్కడే ఆయన బాపుని  కలిసారు. ఒకరికొకరు మంచి స్నేహితులయ్యారు . రమణ కథ రాస్తే బాపు బొమ్మ గీసేవారు. ముళ్ళపూడి కూడా 1954లో ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు. తరువాత వారపత్రికకు మారి సినిమా విభాగాన్ని చూసేవారు. అలా సినిమారంగం వైపు వెళ్ళడానికి కారణమైంది. ఆయన కథ అందించిన తొలి చిత్రం రక్తసంబంధం తరువాత మూగమనసులు, దాగుడు మూతలు, సాక్షి, బుద్ధిమంతుడు ఇలా 39 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే , మాటలు అందించారు. బాపు దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలకు పనిచేశారు. వారిద్దరూ "చిత్రకల్పన" బ్యానర్ ని స్థాపించి  అందాల రాముడు, సీతా కళ్యాణం వంటి 4 సినిమాలు నిర్మించారు. ఈ జంట రఘుపతి వెంకయ్యఅవార్డు గెలుచుకుంది. రాజ్యలక్ష్మి పురస్కారం, యూనివర్శిటీలు డాక్టరేట్ అందజేశాయి. ముళ్ళపూడి 2011 ఫిబ్రవరి 24న దివంగతులయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి