15, మే 2016, ఆదివారం

Kotipalli - Narsapuram Railway Line (Review)



పర్యాటక సొగసులతో అలరారే పచ్చని సీమ... పొంగిపొర్లే జలవనరులు.. పుష్కలంగా పంటలు, భూగర్భంలో చమురు, సహజవాయువుల లభ్యత, కొబ్బరి ఉత్పత్తులు, అరటి రవాణాతో కోనసీమకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. నిత్యం వేలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కోనసీమకు రైలుమార్గం ఏర్పాటు దశాబ్దాలుగా కలగానే ఉంది.

ఏటా రూ.800 కోట్ల విలువైన ఉత్పత్తుల రవాణా
కోనసీమ నుంచి ఏటా దేశంలోని ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌, తెలంగాణా ఇతర రాష్ట్రాలకు దాదాపుగా రూ.800 కోట్ల విలువైన కొబ్బరి ఉత్ప త్తులు రవాణా అవుతున్నాయి. ఇవి కాకుండా రూ.400 కోట్ల విలువైన పీచు, ఇతర ఉత్పత్తులు కూడా ఎగుమతి అవుతున్నాయి. వీటి పన్నుల రూపేణా రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. కోనసీమ మీదుగా రైలు మార్గం ఉంటే కొబ్బరి ఉత్పత్తులన్నీ రైళ్ల రవాణాతోసాగే అవకాశం ఉంటుంది. దీంతో కోన సీమలోని కొబ్బరి రైతు లకు ఊరట లభిస్తుంది.

అరటితోనూ భారీ ఆదాయం
కోనసీమ నుంచి ఏటా రూ.200 కోట్ల విలువైన అరటి ఎగుమతులు వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రావులపాలెం, మద్దిపేట గ్రామాల నుంచి రోజుకు రూ.40 లక్షల విలువైన ఎగుమతులు ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌కు ఎగుమతి అవున్నాయి. ఇక లంక గ్రామాలైన అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల నుంచి బత్తాయి, నిమ్మ తదితర పంటలు ఎగుమతి అవుతున్నాయి. తమలపాకులు కూడా భారీగా ఇక్కడి నుంచే ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాయి.



నిర్మాణరంగ వనరులు 
రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, రావులపాలెం, గోపాలపురం, కొత్తపేట, అయినవిల్లి తదితర ప్రాంతాల నుంచి ఆయా ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం 40 - 50 లారీల్లో తెలంగాణాకు ఎగుమతి అవుతుంది. రైల్వే రవాణా సౌకర్యం ఉంటే ఇసుక రవాణా రాష్ట్ర ఎల్లలు దాటే అవకాశం ఉంది. కోనసీమలోని లంక ప్రాంతాల్లో తయారుచేసే ఇటుకకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గిరాకీ ఉంది. నిత్యం రావులపాలెం, కొత్తపేట మండలాల నుంచి 70కుపైగా లారీల్లో ఇటుక బాహ్యప్రాంతాలకు వెళ్తుంది. రైలుమార్గాలు ఉంటే ఈ వ్యాపారాలు ఏస్థాయిలో జరుగుతాయో చెప్పకనే అవగతం అవుతుంది.

కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూమిపూజ జరిగిన తర్వాత 15 ఏళ్లలో గత రైల్వేబడ్జెట్‌లో ఇప్పటివరకు మొత్తమ్మీద రూ.85 కోట్లు మాత్రమే వెచ్చించారు. 15 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ ప్రజాపతి జి.ఎం.సి. బాలయోగి కృషితో కోనసీమ రైల్వే లైను ఏర్పాటు ప్రతిపాదన ముందు కొచ్చింది. ఈ మేరకు నాటి కేంద్ర ప్రభుత్వం రూ.685 కోట్ల అంచ నాలతో కోటిపల్లి - నర్సాపురం వరకు రైల్వేలైన్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. అమలాపురంలోని రైల్వేస్టేషన్‌ను, భట్నవిల్లిలో సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం బాలయోగి దుర్మరణంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతీ లేదు. అప్పటి నుంచి కోనసీమ రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు నేతలకు ఎన్నికల హామీగా మారిపోయింది. ప్రస్తుతం  కోనసీమ రైల్వేలైన్‌ అంచనా  సుమారు రూ.1,200 కోట్లకు చేరింది. ఇది కార్యరూపం దాల్చితే ఏటా సుమారు సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ పొందే అవకాశం ఉన్నా ప్రభుత్వ పెద్దలతోపాటు రైల్వే ఉన్నతాధికారులు చొరవచూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత ముఖ్యమైన కోటిపల్లి- నర్సాపురం రైల్వేలైన్‌ను తప్పకుండా నిర్మించాల్సిన అవసరం ఎంతో వుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ద చూపించవలసిందిగా గోదావరి ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి