12, మే 2016, గురువారం

Bala Balaji Temple - Appanapali (శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం - అప్పనపల్లి )




అప్పనపల్లి  శ్రీ బాల బాలాజీ స్వామి


అప్పనపల్లి, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము. అప్పనపల్లి Razole (రాజోలు) నుండి 18 కి.మీ దూరంలో వున్నది. ఈ గ్రామానికి   Razole (రాజోలు) నుండి ప్రతి గంటకి  RTC  బస్సు సౌకర్యం కలదు. 

ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అప్పన (నూకల అప్పన) అనే ఋషి ద్వారా వచ్చింది. ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి.

ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానములు కలవు. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల శీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకనాడు కొబ్బరి రాశి లో ఒక కొబ్బరి కాయ లో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్టించి శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.

ఇక్కడ దేవాలయములో ప్రతిష్టించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ కలదు. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి మరియు కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్థంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చినవి. విచిత్రముగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్థంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు.



అప్పనపల్లి  దేవస్థానం


అక్కడ జరిగే పూజాదులు, సేవలు, సాంసృతిక సేవా కార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్వార్థము వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానము తీరుగా వచ్చిన వారందరకూ ఉచిత భోజనము, లోపములేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతముగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికముగా ఉండుటవలన ప్రభుత్వ దేవాదాయశాఖ వారు దేవస్థానమును వారి ఆధీనములోకి తీసుకొన్నారు. అప్పటి నుండి వారు పాత కార్యవర్గమును రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమములను నిలిపివేయుటతో భక్తుల రాకపోకలు గణనీయముగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల ఒరవడి తగ్గుట ఆదాయము మందగించుటతో ఈ మధ్యనే తిరిగి యధాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించుట మొదలెట్టినారు.

పాత దేవాలయము
ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము కలదు. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉన్నది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.


దేవాలయం మీద శిల్పములు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి