![]() |
Coconut Coir Geo Textiles |
![]() |
Estuarine Abrasion Prevented using Coir Geotextile |
రాష్ట్రంలో సుమారు లక్షా ఇరవై వేల హెక్టార్ల విస్తీర్ణంలో కొబ్బరి పంట సాగువుతోంది. ఇందులో ఏభై శాతం విస్తీర్ణం తూర్పు గోదావరి జిల్లాలోనే సాగువుతోంది. కొబ్బరి సాగులో దేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంటే, ఆంధ్ర రాష్ట్రం నాలుగోవ స్థానంలో ఉంది. కొబ్బరి పీచు నుంచి తాడు, డోరుమ్యాట్లు, పరుపులు, కొబ్బరి ఇటుకలు, పొట్టు నుంచి ఎరువు తదితర ఉత్పత్తులు, జియో టెక్స్‌టైల్, ఫ్లైవుడ్స్, ఫర్నిచర్, అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్ ఉత్పత్తులకు బదులుగా కుండీల వంటి ఉత్పత్తులు ఇలా ఎన్నో... ఎన్నెన్నో.. కొబ్బరి పీచు ఆధారిత ఉత్పత్తులు విస్తరిస్తున్నాయి.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కాయర్ బోర్డు ఎన్నో ప్రోత్సాహక పథకాలను అందిస్తుంది. చిత్తశుద్ధిగా కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమల్లో ఔత్సాహికులను ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా వరకూ నిరుద్యోగాన్ని పారదోలి ఉపాధి విస్తృత ప్రాతిపదిక కల్పించినట్టే.
రాజమండ్రిలోని కాయర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల సముదాయాలకు సుమారు రూ.12 కోట్ల నిధులను విడుదల చేసింది. కాయర్ ఉద్యమి యోజన పథకం కింద కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి ఇప్పటికే పరిశ్రమలు నడుపుతున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పది లక్షల రూపాయల అంచనా విలువతో యూనిట్‌గా పరిశ్రమలను నెలకొల్పే విధంగా ప్రోత్సాహ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ఐదున్నర లక్షలు బ్యాంకు రుణం అయితే, నాలుగు లక్షలు రాయితీ, మిగిలిన రూ.50 వేలు లబ్ధిదారుని భాగస్వామ్య మొత్తంగా ప్రభుత్వం నిర్ణయించింది.
![]() |
Geo Textile usage in Road Making |
వృథాగా విడిచిపెట్టే కొబ్బరి పొట్టు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఎరువుగా మారింది. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటే చెత్తను కూడా సద్వినియోగం చేసుకోవచ్చుని నిరూపిస్తున్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. మట్టికి బదులుగా కొబ్బరి పొట్టును సేంద్రియ ఎరువుగా వినియోగించే స్థాయిలో టెక్నాలజీ పెరిగిందంటే అందుకే ఇప్పుడు కల్పవృక్షమే కాదు...ఔత్సాహికులకు అక్షయపాత్ర కూడా.
కొబ్బరి ఉత్పత్తులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అక్షయ పాత్రగా మారుతున్నాయి. ఆధునిక టెక్నాలజీతో ఈ కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమ మరింత విస్తరిస్తుంది అని ఆశించడం అతిశయోక్తి కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి