28, మే 2016, శనివారం

నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (2)


Kadukuri - Chilakamarthy
కవిగా, సంస్కరణవేత్తగా, పత్రిక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందిన తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు,  జాతీయ కవిగా పేరు పొందిన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన చిలకమర్తి లక్ష్మినరసింహం పంతులు మిత్ర ధ్వయం గోదావరి తీరాన్ని సుసంపన్నం చేసారు.

సంఘ సంస్కర్త  కందుకూరి


సంఘసంస్కరణ కర్త అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది  కందుకూరి వీరేశలింగం పంతులు గారే.

కందుకూరి గారు 1848 ఏప్రిల్ 16న పున్నమాంబ, సుబ్రహ్మణ్యం దంపతులకు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు.  ఏడేళ్ళ వయసున్న బాపమ్మ(రాజ్యలక్ష్మి) తో కందుకూరికి 13 యేట వివాహం జరిగింది. 1870లో కోరంగిలో ఇంగ్లీషు స్కూలులో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. అనంతరం ఆయన సంఘ సంస్కరణలవైపు మొగ్గుచూపారు.

బెంగాల్లోని బ్రహ్మసమాజ ఉద్యమం, బొంబాయిలోని ప్రార్థన సమాజం వీరేశలింగాన్ని బాగా ప్రభావితం చేశాయి. మూఢనమ్మకాలు, ఆచారాలు, సంఘంలోని దుశ్చర్యలపై పోరాడారు. రాజమండ్రిలో 1881 డిసెంబర్ 11న 22 ఏళ్ళ గోకులపాటి శ్రీరాములు, 12 ఏళ్ళ గౌరమ్మ (బాలవితంతువు)కు పెళ్ళి జరిపించారు. ఈ వివాహాన్ని అపడానికి, పెళ్ళి కూతురును ఎత్తుకు పోవడానికి వీరేశలింగంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. విద్యార్థులు, ఆంగ్లేయుల  సహకారంతో పెళ్ళి సజావుగా జరిగింది. తర్వాత మద్రాసులో 1883 జూన్ 7న ఒక వితంతు వివాహం జరిపించారు. దీంతో వీరేశలింగం ప్రభావం దక్షిణ భారత దేశం అంతటా వ్యాపించింది.అలా గోదావరి పుష్కరాల సమయంలో ఒక వితంతు వివాహం జరిపించారు. 1897లో వీరేశలింగం ఆధ్వర్యంలో మద్రాసు బ్రహ్మ సమాజం హాలులో సరోజినీదేవి, డాక్టర్ గోవిందరాజులనాయుడు కులాంతర, భాషాంతర వివాహం జరిగింది. 1905లో హితకారిణీ సమాజాన్ని రాజమండ్రిలో స్థాపించారు. అప్పట్లో రూ.41,500 విలువ చేసే ఆస్తులను సమాజానికి ధారాదత్తం చేశారు. 1906లో వీరేశలింగం కులాన్ని సూచించే యజ్ఞోపవీతాన్ని త్యజించి కులాన్ని పూర్తిగా విడనాడారు.సంస్కరణోద్యమానికి మద్రాసు సరైన వేదికని భావించి వీరేశలింగం తన కార్యకేంద్రాన్ని మద్రాసుకు మార్చి వితంతు శరణాలయాన్ని స్థాపించారు. 1919 మే 27న కందుకూరి తుది శ్వాస విడిచారు. మరణించేవరకు జాతి సంస్కరణోద్యమమే ధ్యేయంగా జీవితాన్ని గడిపారు. తన సమాధిపై "యధార్థ ఏకేశ్వర విశ్వాసి"  అని లిఖించవలసిందిగా కోరుకున్నారు.

సాహితీ వేత్త చిలకమర్తి

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు 1867లో  పశ్చిమ గోదావరి జిల్లా లోని ఖండవల్లి గ్రామంలో జన్మించారు . చిన్నతనం నుంచి ఆయన సాహితీ రంగంపై మక్కువ చూపేవారు. వీరవాసరం, నరసాపురం తర్వాత రాజమండ్రిలో చదువుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలోనే సాహి త్యంపై దృష్టి పెట్టారు. అదే ప్రక్రియ క్రమంగా ఆయనకు జాతీయ కవిగా పేరు తెచ్చింది. కథలు, నవలలు రచించి సున్నిత హాస్యం జోడించి సాహితీ రంగాన్ని సుసంపన్నం చేశారు. కీచకవధ, సౌందర్యతిలకం, నీలచరిత్ర, పారిజాతపాహరణం, మార్కేండేయ పురా ణం వంటివి రాశారు. కొంతకాలం పాటు ఆయన కలకత్తాలో ఉన్నారు. తిరిగి రాజమండ్రి వచ్చాక ఆర్యసమాజ బోధకుడు పండిత శివనాధ శాస్త్రి తో  పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగంతో సాన్నిహిత్యం ఏర్పడింది. కందుకూరి స్థాపించిన హితకారిణి సమాజానికి ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. ఎన్నో సాహితీ ప్రక్రియలతో ఎన్నో అవార్డులు పొందారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆయన ‘భరతఖండంబు చక్కటి పాడియావు’ అంటూ బ్రిటీషు వారిపై రచించిన పాట ఆ రోజుల్లో మారుమోగిపోయింది. 1946లో సాహితీ సామ్రాట్ దివంగతులయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి