రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య జంట.. సృష్టించిన డైలాగుల అలజడి.. ఆరోజుల్లో ఒక సెన్సేషన్. ఎన్నివందల సినిమాల్లో వారు నటించినా.. ఏనాడు ప్రేక్షకులకు విసుగు పుట్టలేదు. వారు తెరపై కనిపించగానే ప్రేక్షకుల్లో నవ్వులు..పువ్వులై విరిసేవి. 90వ దశకం వరకూ తెలుగుతెరపై రావు గోపాలరావు విలనిజం, ఆయన డైలాగ్ డెలివరి, అతనికి సహాయంగా ఉంటూ అతనినే దెప్పిపొడుస్తూ చక్కటి హాస్యాన్ని పండించే అల్లు రామలింగయ్య ధ్వయాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. రావుగోపాలరావుది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అయితే.. అల్లు రామలింగయ్యది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. వీరిద్దరూ జంటగా నటించిన సినిమాలు ఎన్నో శతదినోత్సవాలు చేసుకున్నాయి.
రావుగోపాలరావు 1937జనవరి 14న కాకినాడలో జన్మించారు. అక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో సభ్యుడిగా ఉంటూ ఆ వేదిక ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు.ఆ దశలోనే దర్శకుడు గుత్తా రామినీడు సినిమాల్లో అవకాశం కల్పించారు. తొలిరోజుల్లో గొంతు బాగోలేదని డబ్బింగ్ చెప్పించారు. తర్వాత అదే గొంతుతో ఒక కొత్త వరవడి సృష్టించారు. విలన్ పాత్రలతోపాటు ఉదాత్త నటన పోషించిన ఆయన బాపు రమణల సృష్టి ‘ముత్యాల ముగ్గు’లో పెద్ద మనిషి పాత్రతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇలా వందలాది చిత్రాల్లో నటించిన ఆయన 1994లో దివంగతులయ్యారు.
1922లో అల్లు రామలింగయ్య పాలకొల్లులో జన్మించారు. ఆయనకు హోమియో వైద్యం అంటే ఇష్టం. ఆయన కూడా నాటక రంగం నుంచే 1950ప్రాంతంలో ఆయన సినిమా రంగంలో అడుగెట్టారు. అంతకుముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. పుట్టిల్లు సినిమాలో పురోహితుడి పాత్రతో ఆకట్టుకున్నారు. తరువాత హాస్యనటుడిగా ఆయన వెనుదిరిగి చూడలేదు. ‘దొంగరాముడు, మాయాబజార్, మిస్సమ్మ,అప్పు చేసి పప్పుకూడు, వేటగాడు, ఊరికి మొనగాడు, ముత్యాలముగ్గు, అందాలరాముడు, మంత్రి గారి వియ్యంకుడు’ వంటి సినిమాల్లో అగ్ర హీరోలందరితోను నటించిన ఆయన ప్రత్యేకంగా రావుగోపాలరావుతో అల్లు రామలింగయ్య ది సూపర్ హిట్ కాంబినేషన్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి