29, మే 2016, ఆదివారం

నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (3)


రేలంగి -సూర్యకాంతం

పాత తరం సినిమా ప్రేక్షకులకు సూర్యకాంతం, రేలంగి జంట పేర్లు వింటేనే మనసు ఉల్లాసమవుతుంది. ఎందుకంటే గయ్యాళి భార్యగా సూర్యకాంతం, అమాయకపు భర్తగా రేలంగి నటన తెరపై బాగా పండేది. 



సూర్యకాంతం

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు చెందిన సూర్యకాంతం, పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లిగూడెంకు చెందిన రేలంగి ఇద్దరూ పాతతరం సినిమాల్లో 40 ఏళ్ళ పాటు ప్రేక్షకులను అలరించారు. భర్తను అదుపులో ఉంచుకునే గడసరి ఇల్లాలి పాత్ర, గయ్యాళి అత్త పాత్రలకు ఆమె మారుపేరు. దొంగరాముడు, తోడి కోడళ్ళు, ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మా యిలు, చక్రవర్తి వంటి అనేక సినిమాల్లో రేలంగిని నిత్యం వేధిస్తూ కొంగున ముడేసుకునే పాత్రలు పోషించారు. 1927 డిసెంబర్ కాకినాడలో పొన్నమండ అనంతరామయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించిన సూర్యకాంతం 19వ ఏటే ‘నారద నారది’ అనే సినిమాలో నటించారు. వెలుగునీడలు, మంచి మనుషులు, మాయాబజార్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. మాయాబజారులో సుపుత్ర నీకిది తగదంటిని కదరా అన్న మేనరిజంతో ఆకట్టుకున్నారు. 1994లో ఆమె పరమపదించారు.

రేలంగి

సూర్యకాంతానికి జోడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లాలో  జన్మించినప్పటికీ తరువాత వారి కుటుంబం  తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. 1910లో జన్మించిన రేలంగి, 1935లో శ్రీకృష్ణ తులాభారంలో విదూషకునిగా నటించారు. తరువాత గొల్లభామ, కీలుగుర్రం, గుణసుందరి కధ, పాతాళభైరవి, పెద్దమనుషులు, మిస్సమ్మ, చెంచులక్ష్మి, అప్పు చేసి పప్పుకూడు, భీష్మ ఇలా 500పై చిలుకు సినిమాల్లో నటించారు. ఒకే షాట్లో ముఖంలో భావాలను మార్చిమార్చి ప్రదర్శించడం, మాటలన్ని మంచి టైమింగ్ లో  పలికి హాస్యాన్ని పండించడంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి