పువ్వు, కాయ , పండు ఇది సృష్టి చక్రంలో పరిణామక్రమం. కాని ఎప్పుడు కాయ గానే వుండే అద్భుత ఫలం కొబ్బరి కాయ. లేతగా వున్నప్పుడు "బొండం" గా పిలవబడుతూ అందరి దాహం తీరుస్తుంది, కొద్దిగా ముదరగానే కొబ్బరి కాయగా పిలవబడుతూ అతి పవిత్రమైన దైవ కార్యాలలోను, మన నిత్య జీవితంలోను అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. సృష్టిలో ఎన్నో ఫలాలున్నా వాటిలో "పండు" అవస్థ లేనిది ఒక్క కొబ్బరికాయకి మాత్రమే. అది ఎప్పుడూ కాయే! పండి పోవడం తెలియని కాయ. దాని పుట్టుకే విశిష్టతతో కూడుకున్నది.
దైవారాదనలో , భోజనంలో, వివాహంలో, బతుకుదెరువులో కొబ్బరికి ఉన్న ప్రాముఖ్యత భూమ్మీద మరిదేనికీ లేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఉపయోగపడినట్టే, కొబ్బరిచెట్టులోని ప్రతి భాగం మనకు పనికొస్తాయి. అందుకే కొబ్బరి చెట్టుని "భూలోక కల్పవృక్షం" అని పిలవవచ్చు. ఇలాంటి కొబ్బరిచెట్టు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము.
ఆరోగ్యంగా ఉంటే కొబ్బరిచెట్టు సంవత్సరానికి కనీసం 75 కాయలు దిగుబడి ఇస్తుంది .
కొబ్బరి పంట దగ్గర దగ్గరగా 92 దేశాల్లోని సుమారు మూడు కోట్ల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. సంవత్సరానికి సుమారు 6 కోట్ల టన్నుల కాయలు దిగుబడి జరుగుతుంది . భారతదేశం, ప్రపంచంలో 16% వాటాతో మూడో స్థానంలో వుంది. మళ్లీ మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో 92% - కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలదే . తిరిగి ఇందులో సగం వాటా కేరళ రాష్ట్రానిదే. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కొబ్బరి తోటలు మన కోనసీమ లోనే వున్నాయి.
కొబ్బరి అత్యధికంగా పండించే తొలి పది దేశాలు 1.ఇండోనేషియా 2.ఫిలిప్పీన్స్ 3. భారత్ 4.శ్రీలంక 5.బ్రెజిల్ 6.థాయిలాండ్ 7.వియత్నాం 8.మెక్సికో 9.పాపువా న్యూ గినియా 10.మలేషియా
మాల్దీవుల జాతీయవృక్షం కొబ్బరిచెట్టు. జాతీయచిహ్నంలో కూడా కొబ్బరి చెట్టు ఉంటుది.
![]() |
కొబ్బరి తడిక / చాప |
నీళ్లనూ, పాలనూ, నూనెనూ, కొబ్బరినీ, టెంకనూ, మీది పీచును కూడా వినియోగించుకోగలిగే అద్భుత ఫలం ఇది. అసలు ఇందులో వృథా అయ్యేది ఏదీ లేదు. కాయ, ఆకు, కాండం అన్నీ పనికొచ్చేవే! ఆకలి తీర్చి, దప్పిక తీర్చి, పోషకాహారాన్ని ఇచ్చి, నీరసంగా ఉంటే అలసట తీర్చి శక్తిని అందించే , ఇలాంటి చెట్టును "కల్పవృక్షం" అనికాకుండా మరేమంటారు? అందుకే ఒక్క కొబ్బరిచెట్టు మనిషి మనుగడకు అండాదండ. అందుకే కొబ్బరికి అంత ప్రాధాన్యత.
ఇక శరీరానికి ఆరోగ్యం అందించే విషయం లోను కొబ్బరిది అగ్రస్థానమే. A Coconut a day keeps the Urologist away (రోజు ఒక కొబ్బరి బొండం తాగితే, మూత్రపిండాలకు సంబంధించిన వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం రాదు) అనే సామెత కుడా వాడుకలో వుంది. బొండం నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలాంటి ఖనిజ లవణాలు వుంటాయి. కొబ్బరి బొండం నీరు శరీరంలో వుండే అధిక ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చిన్నప్రేవుల్లోని పురుగుల్ని చంపేస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కలిగివుంటుంది. మూత్రం సాఫీగా జరిగేటట్టు చేసి, శరీరాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది. నీరసంగా ఉన్నవాళ్లకు కూడా కొబ్బరి ఎంత సులభంగా శరీరంలో కలిసిపోగలదంటే, దాన్ని జీర్ణం చేయడానికి ప్రత్యేకంగా పైత్యరసం ఉత్పత్తి కానవసరం లేదు. అందుకే అది నేరుగా రక్తంలో కలిసిపోయి, తక్షణం శక్తి ఇస్తుంది. అందుకే దాన్ని జీవద్రవం అంటారు.
కొబ్బరినీరు రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయం కాగలదు. పైగా ఎర్ర రక్తకణాలకు హాని చేయదు, అలెర్జీ కలిగించదు. అందుకే యుద్ధ సమయాల్లో ఐ.వి.(ఇంట్రా వీనస్) ద్రవాలు అందుబాటులో లేని సందర్భాల్లో- ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధం, వియత్నాం యుద్ధ కాలంలో- అప్పుడే దింపిన తాజా కొబ్బరినీటిని సైనికులకు నేరుగా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించేవారు.
