6, జూన్ 2016, సోమవారం

తూర్పుగోదావరి జిల్లా - పంటలు

తూర్పుగోదావరి జిల్లాలో వరి,కొబ్బరి, చెఱుకు,పత్తి,మొక్కజొన్న, పామాయిల్, అపరాలు మొదలైన పంటలు పండుతాయి.  ఇక్కడ నల్లరేగడి, ఇసుక, ఎర్రనేలలు తదితర చాలా రకాల సాగునేలలు ఉన్నాయి. నేలల స్వభావాన్ని బట్టి పంటలు సాగు అవుతాయి. 

 వరి 
తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట ప్రధానమైన పంట . జిల్లాలో  4.50 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తున్నారు.  మొత్తం గోదావరి డెల్టాలో పండే వరిలో 40 శాతం తూర్పుగోదావరి జిల్లాలో పండుతోంది. ఇక్కడ ఖరీఫ్, రబీల్లో వరిని ప్రధాన పంటగా సాగుచేస్తారు.  కోనసీమలో ప్రధానంగా సాగుచేస్తున్న వరి పంటకు గోదావరి నీరే ఆధారం. ధవళేశ్వరం బారేజ్ కాలువల  ద్వారా  వచ్చే గోదావరి నీళ్ళతో  గోదావరి డెల్టాలోని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలలో ఈ పంటను సాగుచేస్తున్నారు.





కొబ్బరి 

తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1.25లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ముఖ్యంగా ఈ పంట కోనసీమలో కేంద్రీకృతమై ఉంది. సుమారు 70లక్షల కొబ్బరి చెట్లు ఇక్కడ ఉన్నాయి. కొబ్బరి  తోటలతో పాటు చేలగట్ల మీద కూడా కొబ్బరిచెట్లను ఎక్కువగానే పెంచుతున్నారు.  ఇక్కడ పండిన కొబ్బరి దేశంలోని నలుమూలలకూ ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.
  
కొబ్బరి పంటపై పరిశోధన చేసేందుకు గాను జిల్లాలోని అంబాజీపేటలో  కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. కొబ్బరి పంటకు వ్యాపిస్తున్న తెగుళ్లు, పురుగుల నివారణకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలోనే  ఏర్పాటైన ఏకైక పరిశోధనా కేంద్రం అంబాజీపేట ఉద్యాన ( కొబ్బరి) పరిశోధన కేంద్రం. 1955 సంవత్సరంలో  ఈ కేంద్రాన్ని, 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. ముఖ్యంగా కొబ్బరి పంటకు వ్యాపించే తెగుళ్లు, పురుగుల నివారణకు ఇక్కడ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు. క్రొత్త రకాల కొబ్బరిమొక్కలను  సృష్టిస్తున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో  కొబ్బరిమార్కెట్టుకు పెట్టింది పేరు అంబాజీపేట. ఇక్కడ ప్రతి బుధ, గురువారాలు కొబ్బరిసంత జరగుతుంది, లక్షలాది రూపాయల్లొ  వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కొబ్బరి, కొత్తకొబ్బరి, కురిడీ కొబ్బరికి సంబంధించి వ్యాపార లావాదేవీలు నడుస్తాయి.  కురిడీ వ్యాపారుల సంఘం, కొబ్బరి వర్తక సంఘాలతో పాటు కొబ్బరిరైతులను చైతన్యం చేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ నేతృత్వంలో అంబాజీపేట కేంద్రంగా రైతు సంఘం ఉంది.


అరటి

గోదావరి లంకల్లోనూ, కొబ్బరి తోటల్లో అంతరపంటగాను జిల్లాలో అరటి పంట విరివిగా సాగవుతుంది. అరటి పంటకు కోనసీమ ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని మిగతా ప్రాంతాలకు వచ్చేసరికి మెట్టలో ముఖ్యంగా కోటనందూరు మండలంలో అరటి పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నారు. ఏటా రూ.500ల కోట్ల విలువైన అరటి పంట పండుతోది. జిల్లాలోని రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్ ద్వారా ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ ఆసియాలోనే అతి పెద్ద మర్కెట్ గా పేరుగాంచింది. కోనసీమలో పండిన అరటి పంటను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
  

చెఱుకు 
జిల్లాలోని దాదాపు 35 వేల ఎకరాల్లో చెఱుకు పంట  సాగువుతోంది.  వచ్చిన పంటలో అధిక భాగం చక్కెర పరిశ్రమలకు చేరుతుంది. దిగుబడిలో 10% మాత్రమే  రైతులు స్వయంగా బెల్లం తయారు చేస్తుంటారు. కిర్లంపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఈ ప్రక్రియ అధికంగా సాగుతోంది. పండించడానికి వ్యయం అధికంగా అవ్వడం మరియు  దీర్ఘకాలిక పంట కావడంతో చెరకు సాగుపై గతంలో కన్నా మక్కువ తగ్గింది.





పత్తి 


జిల్లాలో సుమారు  30వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం, తుని, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. 










మొక్కజొన్న

జిల్లాలోని సీతానగరం మండలంలో అధికంగా మొక్కజొన్నను సాగు జరుగుతున్నది. మొక్క జొన్నను   ఎక్కువగా కోళ్ల మేతలో వినియోగిస్తారు. జిల్లాలో కోళ్ల పరిశ్రమ అధికంగా ఉండడంతో పండిన మొక్కజొన్న స్థానికంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి.  









అపరాలు  

మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి ఖరీఫ్ సీజన్లో 14వేల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రబీ సీజన్లో మాత్రం డెల్టా, కోనసీమ ప్రాంతాలలో అధికంగా అపరాల సాగును చేపడతారు. అపరాల సాగుకు నామమాత్రపు నీటి తడులు సరిపోవడంతో నీటి ఎద్దడి సమయంలో మినుము, పెసల సాగుకే ప్రాధాన్యతను ఇస్తారు.







పామాయిల్  

జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఈ పంటకు పెట్టుబడి తక్కువగా ఉండటము మరియు కూలీల అవసరం అంతగా అవసరం లేకపోవడంతో రైతులు ఈ పంటపై బాగా శ్రద్ద చూపిస్తున్నారు. 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి