10, జూన్ 2016, శుక్రవారం

గోదావరి - మత్యసంపద



జీవనది గోదావరి అనంతమైన మత్యసంపదకు నిలయం. ఈ గోదావరి మీద ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. గోదావరి నది నీటిలో దొరికే రకరకాల చేపలు అంటే ఎవరికైనా మక్కువే. సుమారు 1500 కి.మీ నిడివి కలిగిన గోదావరి నది, సముద్రంలో కలిసే వరకు అనంతమైన మత్యసంపదకు నిలయం. ఎలాంటి వారైన గోదావరి చేపల రుచికి దాసోహం అనవలసిందే.

Pulasa
గోదావరి చేపలు అనగానే ముందు గుర్తుకొచ్చేది పులస చేప . ఇది తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే దొరికే అరుదైన చేప. వేరే ఖండాలనుండి సుదూరము ప్రయాణం చేసి  గోదావరినదిలోకి వలసవచ్చే విదేశీ అతిధి ఈ పులస. బంగాళాఖాతం లో వుండగా ఇలసగా పిలవబడే ఈ చేప, గోదావరికి వరద నీరు రాగానే ఆ నీటిలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు వీటిని పులసలుగా పిలుస్తారు. ఇవి గోదావరి బంగాళాఖాతం లో కలిసే ప్రదేశం నుండి ధవళేశ్వరం బ్యారేజీ వరకు వుండే గోదావరి నీటిలో మాత్రమే  దొరుకుతాయి. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. రుచికరమైన చేపలలో దీనిది ప్రధమస్థానం. 

పండుగొప్ప, ఇది గోదావరి నీటిలోను మరియు  పంట కాలువల్లో కూడా పెరుగుతుంది 


Chiramenu
ఉప్పుటేరులో రామలు, రొయ్యలు, పీతలు వంటివి విరివిగా దొరుకుతాయి. గోదావరి నీటికాల్వల్లో బొమ్మిడాయలు లభిస్తాయి. వీటితో పాటు అనేక రకాల తినే పాములు లభ్యమవుతాయి. గోదావరిలో కార్తీక మాసం సమయంలో లభ్యమయ్యే ‘చీరమేను’కు చాలా డిమాండు ఉంటుది . ముఖ్యంగా  పండుగొప్పలు, కట్టిపరిగలు, కొయ్యింగలు, దొందులు, జెల్లలు, పీతలు, రొయ్యలు, మెత్తళ్లు, గుడ్డాకురాయిలు, మాగలు, మార్పులు, జెల్లలు, వంజరం, బంగారు తీగ,తుళ్ళు, ఇంగిలాయిలు, వాలుగలు, బొమ్మిడాయలు, బొచ్చులు మరియు పాముజాతిచేపల్లో మలుగు, తెంబేలు వంటి రకాలు, తాబేళ్లు వంటి వివిధ  మత్స్య ఉత్పత్తులు గోదావరి నది ద్వారా లభ్యమవుతాయి.  

ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతులవుతాయి. దీని ద్వారా చేపల వేటదారులు భారీ లాభార్జనలు చేస్తారు.   కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయల వెంబడి నిత్యం చేపల వేటే ప్రధాన వృత్తిగా అనేక మత్స్యకారులు కుటుంబాల వారు బతుకుతున్నారు. వేకువజామునే పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా నదీపాయల్లో మత్స్యసంపదను వేటాడుతూ జీవనం సాగించే మత్స్యకార పల్లెలు కోనసీమలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వీరు గ్రామ, మండలాల వారీగా ఆయా సముద్రపాయల్లో హద్దులు నిర్ణయించుకుని నదుల్లో మత్స్య సంపదపై సర్వహక్కులు కలిగి ఉంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి