29, జూన్ 2016, బుధవారం

Ajjaram - Famous for Brass Business

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో గల  అజ్జరం గ్రామం అంటే ఇత్తడి పరిశ్రమకుపెట్టింది పేరు.  ఇది తణుకు పట్టణానికి సమీప గ్రామము. ఈ ఊరిలో  ఏ వీధిలోకి వెళ్లినా ... టంగ్... టంగ్... మనే చప్పుడే మనని పలకరిస్తూ స్వాగతం పలుకుతుంది . అజ్జరం గ్రామం గత 100 సంవత్సరాల పూర్వం నుంచి ఇత్తడి పరిశ్రమకి పేరొందిన గ్రామం, సుమారు 10వేలమంది ఎన్నో ఏళ్లుగా ఇత్తడి వస్తువులు తయారీలో ఉన్నారు. ఈ కేంద్రాల్లో స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి వచ్చి పని చేస్తున్నారు. గతంలో గ్రామంలో 50వరకు ఇత్తడి తయారీ, విక్రయ దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 30 వరకు దుకాణాలు ఉన్నాయి. ఇది అజ్జరం వారి ఇత్తడి సామగ్రి దుకాణమంటూ పలు పట్టణాల్లో దుకాణాలు చూస్తూనే ఉంటాం. అంటే ఆ ఇత్తడికి ఉన్న గిరాకీ ఏ పాటిదో దీన్ని బట్టే అర్థం అవుతుంది.


ఇక్కడ ఇత్తడితో అన్ని రకాల గృహోపకరణాలు (బిందెలు , కాగులు , కలాయ్ గిన్నెలు , గుండిగలు మొదలైనవి ) , దేవాలయాలకు సంబందించిన
మకరతోరణాలు,కలశాలు,ధ్వజస్తంభం తొడుగులు మరియు పంచలోహ విగ్రహాలు తయారుచేస్తారు. ఇవేకాకుండా గృహాలంకారాలను కూడా తయారుచేస్తారు. ఈ ఊరిలో తయారైన ఇత్తడి బిందెలకి  మంచి పేరు ఉంది. శోభన్ బాబు,శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని 'ఎల్లువొచ్చి గొదారమ్మా .....' అనే పాటకోసం వాడిన సుమారు 1000 బిందెలు ఈ అజ్జరం గ్రామం నుండే సరఫరా చేయబడ్డాయి.


అజ్జరం ఇత్తడిలో నాణ్యత బాగుంటుందనేది వినియోగదారుల నమ్మిక. అజ్జరం ఇత్తడి వ్యాపారానికి అదే పెట్టుబడి. ఇక్కడి వ్యాపారులు పాత ఇత్తడి వస్తువులను కొని, వాటిని మరలా కరిగించి తిరిగి వస్తువుల తయారీకి వాడతారు. పాత ఇత్తడిని కరిగించేందుకు ప్రత్యేక నిపుణులు ఉంటారు


 రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు పురుగు మందులు పిచికారి చేసి 10 లీటర్ల ఇత్తడి స్ప్రేయర్ల తయారీకి కూడా అజ్జరం ఎంతో పేరు పొందింది. ఇక్కడ తయారైన  ఈ చేతిపంపు స్ప్రేయర్లను  రైతులు నేటికి ఎంతో నమ్మకంగా కొంటారు.



గుడి గంటల తయారీకి పెట్టింది పేరు అజ్జరం. ఇక్కడ తయారు చేసిన ఇత్తడి గంటలు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు పొందాయి. విదేశాలకు చెందిన వారు కూడా ఇక్కడే గంటలను ప్రత్యేకంగా ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించి తీసుకెళ్తుంటారు.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి