Maredumilli Forest |
ఇప్పుడు ఒకసారి మారేడుమిల్లిలో విహరిద్దాము.
జలతరంగిణి జలపాతం... ఇది మారేడుమిల్లి నుండి సుమారు 8కి.మీ దూరంలో దట్టమైన అడవిలో వుంటుంది. ఎత్తైన కొండలమీద నుంచి కిందకు దూకుతున్న ఈ జలపాతాన్ని చూసి తీరాల్సిందే.
ఇదే కాకుండా మారేడుమిల్లి నుండి 16 కి.మీ దూరంలో స్వర్ణధార, అమృతధార అనే జంట జలపాతాలు చూడతగ్గవి. ఇక మారేడుమిల్లి నుంచి 10కి.మీ దూరంలో వుండే మదణ్కుంజ్ అనే ప్రదేశం లో పైన్ వృక్షాలు అంబరాన్ని చుమ్బిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
Jungel Star |
ఇక్కడ చూడదగ్గ మరోప్రదేశం పాములేరు. ఇది కూడా మారేడుమిల్లి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ ప్రవహించే పాములేరు వాగు చెంతకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. కార్తీకమాసంలో ఈ ప్రాంతం సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ఇక్కడే జంగిల్స్టార్ నేచురల్ క్యాంప్ను ఏర్పాటుచేశారు. వేటపట్ల ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి విశేషాలను వివరించేందుకు వనసంరక్షణసమితి సభ్యులు సహకరిస్తారు. క్యాంపులో గడిపేందుకు 20 మందిని ఒక జట్టుగా చేసి వాళ్లకు గుడారాలు కేటాయిస్తారు. ఈ గుడారాలలో రాత్రిపూట గడపవచ్చు. ఇక పర్యాటకుల కోరిక మేరకు క్యాంపు ఫైర్ని కూడా ఏర్పాటు చేశారు.
తరువాత చూడదగ్గది నందనవనం అని పిలవబడే ప్రదేశం . ఇక్కడ కాలువలమీద వెదురు వంతెనలు నిర్మించారు మరియు పర్యాటకులు సేదతీరేందుకు వెదురు గుడిసెల్ని నిర్మించి వాటిలో వెదురుతో తయారుచేసిన ఫర్నీచరు తో అలంకరించారు.
పుష్పాంజలి ఉద్యానవనం, కాఫీ, రబ్బరు,. మిరియాలు, కమలాతోటలు, ఔషధమొక్కలు ఈ ప్రాంతంలోని అదనపు ఆకర్షణలు.
బోడికొండల దగ్గర సహససిద్ధంగా పెరిగిన వాలిసుగ్రీవనం,సుమారు 125 జాతుల మొక్కలతో సైన్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా వుంది . బొటానికల్ టూర్ చేసే విద్యార్ధులకి ఇది చాలా ఉపయోగపడుతుంది.
![]() |
Bongu Chicken |
మారేడుమిల్లి అంటే ముఖ్యంగా చెప్పుకోతగ్గది బొంగు చికెన్. ఈ మన్య ప్రాంతంలో చేసే ఈ ప్రత్యెక వంటకం పసందైన రుచే కాకుండా , ఆరోగ్యానికీ కూడా ఎంతోమంచిదని ఇక్కడివాళ్ళు చెబుతారు. దీనిని తయారుచేసే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుది. ముందుగా కోడిమాంసం ముక్కలకు మసాలా, పచ్చిమిర్చి మిశ్రమాల్ని పట్టించి, ఒక వైపు తెరిచిన వెదురుబొంగులో ఉంచి అడ్డాకులతో మూతిని మూసి నిప్పులమీద సుమారు గంటసేపు కాల్చుతారు.
పర్యాటకుల కోసం డీలక్స్, బైసన్ పొదరిళ్లు, కంటైనర్ కాటేజీలు, ఏసీలున్న హిల్టాప్ ఇళ్లూ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గిరిజనులే గైడ్లగా వ్యవహరిస్తారు. ఆహారపు ఏర్పాట్ల నుంచీ అన్ని పనులూ వారే చేసి పెడతారు. ఆన్ లైన్ లో మారేడుమిల్లి యాత్రని బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం వాళ్ళ ఆస్ట్రియా, ఫ్రాన్స్, చైనా, అమెరికాల నుంచి పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.
ముఖ్యం చెప్పుకోతగ్గది విషయం, ఈ ప్రాజెక్టు కారణంగా గిరిజనులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ లబ్ధి చేకూరుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి