13, జూన్ 2016, సోమవారం

పందెం కోళ్ళు


రెండు కోడి పుంజుల మధ్య జరిగే ఆధిపత్య పోరునే  "కోడి పందెం" అంటారు. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజులలో ఈ కోడిపందాలను నిర్వహిస్తారు.  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఈ పందాలను నిర్వహిస్తుంటారు. ఈ కోడి పందాలు అతి పురాతన కాలం నుండి  జరుగుతున్నట్టు  చరిత్రకారులు చెబుతారు. 

ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచిన  కోడిపుంజులను "పందెం కోళ్ళు" అని పిలుస్తారు . వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. కోళ్లు పుంజుల కాళ్లకు కత్తులు కట్టి.. కదన రంగంలోకి దింపితే.. రక్తం చిందిస్తూ.. వీరోచితంగా గెలుపుకోసం అవిచేసే పోరాటం అంతాఇంతా కాదు. తనను అప్యాయంగా చూసుకున్న యజమానిని గెలిపించడం కోసం ప్రత్యర్థి పుంజుతో అవి శక్తి కొద్ది పోరాడుతాయి. 


ఈ కోడి పందాలలో బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున మరియు శాంతిభద్రతల సమస్య ఉంటుందని, సంప్రదాయమైన ఈ క్రీడకు  ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అయినా కూడా  చాటుమాటుగా ఈ కోడి పందాలు నిర్వహిస్తారు. 



కోడి రంగును బట్టి ఈ పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు.  వీటిలో డేగ, కాకి ,నెమలి, పర్ల , చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు తెగల కోళ్లుంటాయి. సాధారణ కోడిపుంజులకు భిన్నంగా పందెం పుంజులు దృఢంగా ఉంటాయి. రంగు, సామర్థ్యాన్ని అనుసరించి దాన్ని పలానా తెగ అని గుర్తిస్తారు. ఎరుపు రంగులో ఉండే పుంజును డేగ అని, నీలం రంగులో ఉంటే కాకి అని పిలుస్తారు

ఈ కోడి పందాలు ప్రాచీన క్రీడ అయినందునే , ఈ క్రీడ గురించి తాళపత్ర గ్రంధాలు కూడా వున్నాయి. ఈ గ్రంధాలలో కోడిపుంజు లలో రకాలు, వాటి లక్షణాలు, ఏ పుంజుపై ఏ రకమైన పుంజుని  పందానికి దింపాలి అనే విషయాలు వీటిలో పొందు పరచబడి వున్నాయి.

ఇక ఈ పందెం కోళ్ళకు ఇచ్చే ఆహారం, శిక్షణ కూడా ప్రత్యేకంగా వుంటాయి. వీటికి ఇచ్చే ఆహారం కోసం తక్కువలో తక్కువగా వారానికి రెండు వేల రూపాయలు ఖర్చు వుంటుంది.  జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలు, దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి, పందెంపుంజుని దృఢంగా, ఏపుగా  తయారు చేస్తారు. ఇక పందెం దగ్గరపడే కొలదీ వాటికి తినిపించే ఆహారంలో కూడా మార్పులు చేస్తారు. 


బలమైన తిండితో పాటు పుంజుకి ఇచ్చే శిక్షణ కూడా చాల కఠినముగా వుంటుంది.  రన్నింగ్, స్మిమ్మింగ్, ఇతరత్రా శిక్షణలు అందజేస్తారు.  రోజూ ఉదయాన్నే కోడిపుంజును పరిగెత్తిస్తారు. కోడి బాగా అలసిపోయాక దాని నోట్లో నీరుకొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు. దీనివల్ల పోటీ సమయంలో కోడిపుంజు అలసిపోకుండా ఉంటుంది. అనంతరం పచ్చికోడిగుడ్డు తెల్లసొన తినిపించి కాసేపటి తర్వాత మరో అరగంట పరిగెత్తిస్తారు. తర్వాత కాసేపు విశ్రాంతి ఇస్తారు. అనంతరం జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్లజీలకర్ర, తెల్లజీలకర్ర, గసగసాలు దంచిన మిశ్రమాన్ని ముద్దగా తయారుచేసి కోడిపుంజులకు తినిపిస్తారు. కోడిపుంజు కొత్తశక్తిని సంతరించుకునేందుకు ఈ ఆహారం ఉపయోగపడుతుంది. భోజనానంతరం రెండు గంటలపాటు కోడికి విశ్రాంతి ఇస్తారు. ఆ తర్వాత సమీపంలోని వాగు లేదా చెరువుకి తీసుకువెళ్లి ఈత కొట్టిస్తారు. రోజంతా ఈ ఎక్సర్సైజుల వల్ల కోడి ఓంట్లో నొప్పులు చేరితే తీసివేసేందుకు బాడీ మసాజ్ చేస్తారు. కట్టెల మంటపై మట్టిపిడత ఉంచి దాన్ని వేడిచేస్తారు. ఆ వేడిని ఓ గుడ్డకు పట్టించి ఆ గుడ్డతో కోడి తలకు, ఒంటికి, కాళ్లకు మసాజ్ చేస్తారు. దీనివల్ల కోడి ఒంట్లో ఎక్కడైనా నొప్పులు ఉంటే అవి పోవడానికి ఈ మసాజ్ ఉపకరిస్తుంది. రాత్రికి కూడా మంచి ఆహారం పెట్టి విశ్రాంతి ఇస్తారు.

కత్తి పందాలు, డింకీ పందాలు  అని రెండు రకాలుగా ఈ కోడిపందాలు  జరుగుతాయి. 

కత్తి పందెం: పోటీల్లో పాల్గొనే కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలో దించితే దాన్ని కత్తిపందెం అంటారు. పోటీ పుంజుల్లో కత్తిదెబ్బ కాచుకుని చివరి వరకు ఏ పుంజు నిలుస్తుందో అది విజేత అవుతుంది. ఈ పందెంలో కత్తిగాటుపడి పందెంకోళ్లు మృత్యువాత పడుతుంటాయి. చాలా తక్కువ సమయంలో ఈ పోటీలో ఫలితం వస్తుంది. 

డింకీ పందెం: కోడి పుంజులను మామూలుగా బరిలోకి దింపితే దాన్ని డింకీ పందెం అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రెండు కోళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఈ పోటీలో ఫలితం ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుంది. కత్తిపందాల్లో పాల్గొనే పుంజుల కంటే డింకీ పందాల్లో పాల్గొనే పుంజులు చాలా దృఢంగా ఉంటాయి. 

పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉంటారు.  నిర్వాహకులయితే  పందెం సొమ్ములో 10 శాతాన్ని తీత గా వసూలు చేస్తారు, ఇది నిర్వాహకుల లాభం.

పందెం పుంజుల ధర విషయానికొస్తే వేలనుంచి లక్షలలో వుంటాయి. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి