26, జూన్ 2016, ఆదివారం

Hilsa Ilisha (పులసచేప)




Hilsa Ilisha (పులసచేప)

గోదావరి నదీపాయలు అద్భుతమైన మత్స్యసంపదకు జలాశయాలు.నదీపాయల్లో లభ్యమయ్యే మత్స్య సంపద అంటే ఎంతటి వారైనా మక్కువ చూపాల్సిందే.రుచికే కాదు..గోదావరి చేప తింటే ఆరోగ్యం... అందుకే ఎంతటివారైనా గోదావరి చేప రుచికి దాసోహం అంటారు...

గోదావరి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి.వీటిలో ముఖ్యమైనది పులస. గోదావరి వరద వచ్చిన సమయంలోనే ఇది లభిస్తుంది. వాస్తవానికి ఇది సముద్రంలో వుండే   చేప. గోదావరికి కొత్తనీరు వచ్చినప్పుడు ఎదురొచ్చి ఎర్రనీటిలోని నురగను తిని రుచికరంగా తయారవుతుంది. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. ధవళేశ్వరం దిగువ గోదావరి పాయల్లో మాత్రమే ఇది లభ్యమవుతుంది. 


పులస చేప శాస్త్రీయ నామం 'హిల్సా ఇలీషా' . ఈ  పులసలు ఇతర ఖండాలనుండి గోదావరిలోకి వలసవచ్చిన చేపలు. వీటిని సముద్రములో వున్నప్పుడు  విలసలు అని పిలుస్తారు.పులసలు  సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరదనీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లుపెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం పులసల ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వరదనీటి ద్వారా ఈ పులసలు వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోతాయి. వలలో పడ్డాక బ్రతికివున్న పులసలు వాటిని పట్టుకునే మత్యకారులు కూడా చూడలేరంటే ఆశ్చర్యము కలగక మానదు.  అయితే ఈ చేపలు రెండు రోజులైనా పాడవ్వవు. అదే ఈ పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారిపోతుంది. అలాగని గోదావరి అంతా ఈ పులస ఉండదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. ఈ పులసల్లో ఆడ పులస(శన), మగ పులస (గొడ్డు) అని రెండు రకాలుంటాయి. ఇందులో ఆడచేప(శన) కి   రుచి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ చేప ధర వేలల్లోనే ఉంటుంది. 


పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరకవు. ఏటిమధ్యకు వెళ్లి వలను మత్స్యకారులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వలలూ మూడు రకాలుంటాయి. మూడు పొరలవల, సింగిల్ వల, కత్తు వలలు. పులసలు పట్టుకునేందుకు మూడ పొరల వలను వాడతారు. ఈ వలకు రూ.20 వేలు అవుతుంది. ఈవలలు ఒక్క ఏడాదికే పనిచేస్తాయి. పులసను పట్టేందుకు ఒక నావలో ముగ్గురు చొప్పున మత్స్యకారులు వేటకు వెళతారు. ఆ ముగ్గురూ కలిపి చేపలను పట్టి పెట్టుబడులు తీరుస్తారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటారు. ఇంతా చేసి తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటి రెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు చిక్కనే చిక్కవు. అందుకే వీటి ధర అంత అధికం.

సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి.  కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలు కొంచెం ధర పలుకుతాయి.  పొట్టిలంక, ధవళేశ్వరం, బొబ్బర్లంక సమీపంలో దొరికే చేప ధరలు అధికంగా ఉంటాయి. ఇక్కడ దొరికే చేపలకు రుచి అధికంగా ఉండడంతో డిమాండ్ ఉంటుంది. ఆయా సైజులను బట్టి రూ.500 నుంచి రూ.6 వేల వరకూ ధర పలుకుతాయి. 


వండటంలో నేర్పు ఉన్న వారు తప్ప ఇతరులు ఈ పులస పులుసును వండలేరు. కట్టెల పొయ్యిపై కుండలోనే ఈ పులసను వండుతారు. చింత పుల్లలనే వంటకు వాడతారు. మట్టికుండలో వండిన పులస పులుసు రుచికి ఏదీ సాటిరాదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్, పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనెను ఈ వంటకంలో ఉపయోగిస్తారు. చింతపండును లేతకొబ్బరి నీళ్లలో నానబెట్టి దాని నుంచి తీసిన పులుసునే కూరలోకి ఉపయోగిస్తారు. కొందరు ఒకచుక్క ఆముదాన్ని కలుపుతారు. కొంత ఉడికిన తర్వాత మంటను ఆపేసి చింతనిప్పులతోనే పులుసును మరగనిస్తారు. దీనివల్ల చేపముక్కల్లో ఉన్న సన్నటిముళ్లన్నీ కరిగిపోతాయి. కాసేపటికి కొంత వెన్నముద్దను వేసి దించేస్తారు. మొత్తం వేడంతా పోయి చల్లారిన తర్వాతే సీవండి రేకులో ఉంచుకున్న ఆవకాయతేట పులుసులో కలుపుతారు. ఈ పులస పులుసును రాత్రి వండి ఉదయం తింటేనే రుచి. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి