![]() |
శక్తిపీఠం(పురూహూతికా అమ్మవారు)గా, త్రిగయల్లో ఒకటి(పాదగయ)గా, పంచమాధవ క్షేత్రాల్లో విశిష్ఠమైనదిగా (కుంతీమాధవ క్షేత్రం) పేరొందింది. ఇంకా అనఘా దత్తక్షేత్రంగా, కుక్కుటేశ్వరస్వామి(శివ) నిలయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
త్రిగయలో ఒకటిగా విరాజిల్లుతున్న పాదగయని క్షేత్రం దక్షిణ కాశిగా పిలుస్తారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో గయాసుర అనే రాజు వద్దకు వచ్చి మాయోపాయంతో అతన్ని వధించి అతని కోరిక మేరకు మృతదేహాన్ని మూడుముక్కలు చెయ్యగా వాటిలో పాదలు పడిన చోటు పిఠాపురం పాదగయ శైవక్షేత్రం అయ్యింది. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఆయన పక్కనుండే పార్వతిని రాజరాజేశ్వరిగాను భక్తులు కొలుచుకుంటారు. ఈ పాదగయ నందు తమ పితృదేవతలకు చేయు పిండ ప్రదానం మరియు తర్పణములవలన, వారి పితరులు నూరు తరముల వరకు తరించుదురు అని ఈ క్షేత్ర మహిమ తెలిసిన పెద్దవారు చెబుతారు.

సతీదేవి పార్థివ శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా, ఆ శరీరం 18 భాగాలుగా తెగి వేర్వేరు ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి పీఠభాగం పడిన చోటైన పిఠాపురంలో పురుహూతికాదేవి పదవశక్తి పీఠంగా విరాజిల్లుతోంది.

ఇంద్రుడు బ్రహ్మహత్యా దోష నివృత్తి కోసం అయిదు విష్ణుక్షేత్రాలు ప్రతిష్ఠించగా అవి పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అందులో ఒకటైన కుంతీమాధవక్షేత్రం పిఠాపురంలో ఉంది.
త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయుడు తన భక్తులు సుమతి, రాజశర్మ కోరిక మేరకు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మించడంతో పిఠాపురం ప్రముఖ దత్తక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది.
దివ్యక్షేత్రాల సంగమమైన పిఠాపురాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ క్షేత్రం కాకినాడకు 19 కిలోమీటర్ల దూరంలో వుంది. మద్రాస్-హౌరా బ్రాడ్ గేజ్ లైన్లో వెళ్లే రైళ్లన్నీ ఇక్కడ ఆగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి