29, జూన్ 2016, బుధవారం

Ajjaram - Famous for Brass Business

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో గల  అజ్జరం గ్రామం అంటే ఇత్తడి పరిశ్రమకుపెట్టింది పేరు.  ఇది తణుకు పట్టణానికి సమీప గ్రామము. ఈ ఊరిలో  ఏ వీధిలోకి వెళ్లినా ... టంగ్... టంగ్... మనే చప్పుడే మనని పలకరిస్తూ స్వాగతం పలుకుతుంది . అజ్జరం గ్రామం గత 100 సంవత్సరాల పూర్వం నుంచి ఇత్తడి పరిశ్రమకి పేరొందిన గ్రామం, సుమారు 10వేలమంది ఎన్నో ఏళ్లుగా ఇత్తడి వస్తువులు తయారీలో ఉన్నారు. ఈ కేంద్రాల్లో స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి వచ్చి పని చేస్తున్నారు. గతంలో గ్రామంలో 50వరకు ఇత్తడి తయారీ, విక్రయ దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 30 వరకు దుకాణాలు ఉన్నాయి. ఇది అజ్జరం వారి ఇత్తడి సామగ్రి దుకాణమంటూ పలు పట్టణాల్లో దుకాణాలు చూస్తూనే ఉంటాం. అంటే ఆ ఇత్తడికి ఉన్న గిరాకీ ఏ పాటిదో దీన్ని బట్టే అర్థం అవుతుంది.


ఇక్కడ ఇత్తడితో అన్ని రకాల గృహోపకరణాలు (బిందెలు , కాగులు , కలాయ్ గిన్నెలు , గుండిగలు మొదలైనవి ) , దేవాలయాలకు సంబందించిన
మకరతోరణాలు,కలశాలు,ధ్వజస్తంభం తొడుగులు మరియు పంచలోహ విగ్రహాలు తయారుచేస్తారు. ఇవేకాకుండా గృహాలంకారాలను కూడా తయారుచేస్తారు. ఈ ఊరిలో తయారైన ఇత్తడి బిందెలకి  మంచి పేరు ఉంది. శోభన్ బాబు,శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని 'ఎల్లువొచ్చి గొదారమ్మా .....' అనే పాటకోసం వాడిన సుమారు 1000 బిందెలు ఈ అజ్జరం గ్రామం నుండే సరఫరా చేయబడ్డాయి.


అజ్జరం ఇత్తడిలో నాణ్యత బాగుంటుందనేది వినియోగదారుల నమ్మిక. అజ్జరం ఇత్తడి వ్యాపారానికి అదే పెట్టుబడి. ఇక్కడి వ్యాపారులు పాత ఇత్తడి వస్తువులను కొని, వాటిని మరలా కరిగించి తిరిగి వస్తువుల తయారీకి వాడతారు. పాత ఇత్తడిని కరిగించేందుకు ప్రత్యేక నిపుణులు ఉంటారు


 రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు పురుగు మందులు పిచికారి చేసి 10 లీటర్ల ఇత్తడి స్ప్రేయర్ల తయారీకి కూడా అజ్జరం ఎంతో పేరు పొందింది. ఇక్కడ తయారైన  ఈ చేతిపంపు స్ప్రేయర్లను  రైతులు నేటికి ఎంతో నమ్మకంగా కొంటారు.



గుడి గంటల తయారీకి పెట్టింది పేరు అజ్జరం. ఇక్కడ తయారు చేసిన ఇత్తడి గంటలు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు పొందాయి. విదేశాలకు చెందిన వారు కూడా ఇక్కడే గంటలను ప్రత్యేకంగా ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించి తీసుకెళ్తుంటారు.







26, జూన్ 2016, ఆదివారం

Hilsa Ilisha (పులసచేప)




Hilsa Ilisha (పులసచేప)

గోదావరి నదీపాయలు అద్భుతమైన మత్స్యసంపదకు జలాశయాలు.నదీపాయల్లో లభ్యమయ్యే మత్స్య సంపద అంటే ఎంతటి వారైనా మక్కువ చూపాల్సిందే.రుచికే కాదు..గోదావరి చేప తింటే ఆరోగ్యం... అందుకే ఎంతటివారైనా గోదావరి చేప రుచికి దాసోహం అంటారు...

గోదావరి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి.వీటిలో ముఖ్యమైనది పులస. గోదావరి వరద వచ్చిన సమయంలోనే ఇది లభిస్తుంది. వాస్తవానికి ఇది సముద్రంలో వుండే   చేప. గోదావరికి కొత్తనీరు వచ్చినప్పుడు ఎదురొచ్చి ఎర్రనీటిలోని నురగను తిని రుచికరంగా తయారవుతుంది. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. ధవళేశ్వరం దిగువ గోదావరి పాయల్లో మాత్రమే ఇది లభ్యమవుతుంది. 


పులస చేప శాస్త్రీయ నామం 'హిల్సా ఇలీషా' . ఈ  పులసలు ఇతర ఖండాలనుండి గోదావరిలోకి వలసవచ్చిన చేపలు. వీటిని సముద్రములో వున్నప్పుడు  విలసలు అని పిలుస్తారు.పులసలు  సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరదనీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లుపెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం పులసల ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వరదనీటి ద్వారా ఈ పులసలు వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోతాయి. వలలో పడ్డాక బ్రతికివున్న పులసలు వాటిని పట్టుకునే మత్యకారులు కూడా చూడలేరంటే ఆశ్చర్యము కలగక మానదు.  అయితే ఈ చేపలు రెండు రోజులైనా పాడవ్వవు. అదే ఈ పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారిపోతుంది. అలాగని గోదావరి అంతా ఈ పులస ఉండదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. ఈ పులసల్లో ఆడ పులస(శన), మగ పులస (గొడ్డు) అని రెండు రకాలుంటాయి. ఇందులో ఆడచేప(శన) కి   రుచి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ చేప ధర వేలల్లోనే ఉంటుంది. 


పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరకవు. ఏటిమధ్యకు వెళ్లి వలను మత్స్యకారులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వలలూ మూడు రకాలుంటాయి. మూడు పొరలవల, సింగిల్ వల, కత్తు వలలు. పులసలు పట్టుకునేందుకు మూడ పొరల వలను వాడతారు. ఈ వలకు రూ.20 వేలు అవుతుంది. ఈవలలు ఒక్క ఏడాదికే పనిచేస్తాయి. పులసను పట్టేందుకు ఒక నావలో ముగ్గురు చొప్పున మత్స్యకారులు వేటకు వెళతారు. ఆ ముగ్గురూ కలిపి చేపలను పట్టి పెట్టుబడులు తీరుస్తారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటారు. ఇంతా చేసి తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటి రెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు చిక్కనే చిక్కవు. అందుకే వీటి ధర అంత అధికం.

సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి.  కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలు కొంచెం ధర పలుకుతాయి.  పొట్టిలంక, ధవళేశ్వరం, బొబ్బర్లంక సమీపంలో దొరికే చేప ధరలు అధికంగా ఉంటాయి. ఇక్కడ దొరికే చేపలకు రుచి అధికంగా ఉండడంతో డిమాండ్ ఉంటుంది. ఆయా సైజులను బట్టి రూ.500 నుంచి రూ.6 వేల వరకూ ధర పలుకుతాయి. 


వండటంలో నేర్పు ఉన్న వారు తప్ప ఇతరులు ఈ పులస పులుసును వండలేరు. కట్టెల పొయ్యిపై కుండలోనే ఈ పులసను వండుతారు. చింత పుల్లలనే వంటకు వాడతారు. మట్టికుండలో వండిన పులస పులుసు రుచికి ఏదీ సాటిరాదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్, పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనెను ఈ వంటకంలో ఉపయోగిస్తారు. చింతపండును లేతకొబ్బరి నీళ్లలో నానబెట్టి దాని నుంచి తీసిన పులుసునే కూరలోకి ఉపయోగిస్తారు. కొందరు ఒకచుక్క ఆముదాన్ని కలుపుతారు. కొంత ఉడికిన తర్వాత మంటను ఆపేసి చింతనిప్పులతోనే పులుసును మరగనిస్తారు. దీనివల్ల చేపముక్కల్లో ఉన్న సన్నటిముళ్లన్నీ కరిగిపోతాయి. కాసేపటికి కొంత వెన్నముద్దను వేసి దించేస్తారు. మొత్తం వేడంతా పోయి చల్లారిన తర్వాతే సీవండి రేకులో ఉంచుకున్న ఆవకాయతేట పులుసులో కలుపుతారు. ఈ పులస పులుసును రాత్రి వండి ఉదయం తింటేనే రుచి. 



24, జూన్ 2016, శుక్రవారం

Mada Forest - Coringa Wildlife Sanctuary


ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయాలను మడ అడవులు అంటారు.నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయి.

మడ అడవులలో పెరిగే చెట్ల మరియు పొదల  వేర్లు భూమిలోకి  అల్లుకుపోయి సముద్రం నుంచి వచ్చే అటుపోట్లను, బలమైన ఈదురుగాలులను, సునామీలను అడ్డుకుని తీరప్రాంతంలో  భూమి సముద్ర కోతకు గురికాకుండా కాపాడుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాధారము.
Coringa Wildlife Sanctuary
మడ అడవులలో ఎన్నో రకాల చెట్లు మరియు పక్షులు,కీటకాలు,అనేక రకాల జీవరాసులు జీవిస్తున్నాయి.  తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషించ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. చేపలు, రొయ్యలు, పీతలు మొదలైన మత్స్యసంపద సంతానోత్పత్తికి, వివిధ రకాల పక్షి జాతులు, ఔషద మొక్కలకు అవాసాలుగా మడఅడవులు నిలుస్తున్నాయి.

Coringa Wildlife Sanctuary
తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో 332.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మడ అడవులు విస్తరించి వున్నాయి. 

తూ.గో.జిల్లా లో కాకినా‍‍‍‍‍‍డ సమీప‍ంలొని కొర‍ంగి వద్ద వున్న  కోరంగి అభయారణ్యం (మడ అ‍డవులు) ,  దాదాపు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి వున్నాయి. ఈ అభయారణ్యం సంరక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పర్యవేక్షిస్తుంది.

మడ అడవుల్లో విహారం మనోహర దృశ్య కావ్యం. ఉప్పుటేరులు, పాయలు మధ్యలో పచ్చని పరుపు పరిచినట్లుగా విస్తరించి ఉండే మడ అడవులు పర్యాటక అందాలకు వేదికగా నిలుస్తున్నాయి.


korangi mada forest
ఈ మడఅడవుల మధ్య ఉప్పుటేరులో పడవ ప్రయాణం ఓ మధురానుభూతి. వీటిని తిలకించేందుకు తాళ్లరేవు మండలం కోరంగి, కాట్రేనికోన మండలం బలుసుతిప్పలలో అటవీశాఖ బోట్లను ఏర్పాట్లు చేసింది.
Coringa Wildlife Sanctuary
ఈ అభయారణ్యం కాకినాడ నుండి 20 కి.మీ, రాజమహేంద్రవరం నుండి 70 కి.మీ దూరంలో వున్నది . ఉప్పునీటి మొసళ్ళు ఈ అభయారణ్యం ప్రత్యేకత.  కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి డిసెంబర్ నుండి జూన్ నెలల మధ్య కాలం అనువైనది. 
Coringa Wildlife Sanctuary










21, జూన్ 2016, మంగళవారం

Pithapuram (The Saiva,Vishnu,Sakthi,Datta kshetram)




 దేశంలో మరెక్కడాలేని విధంగా ఒకేచోట శైవ,శక్తి,,విష్ణు, దత్త మందిరాలు  వున్న  దివ్య క్షేత్రమే పిఠాపురం. భారతదేశంలో ఉన్న  అతిపురాతన దివ్య క్షేత్రాలలో ఇదొకటి.  ఈక్షేత్రం  దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల విశ్వాసాన్ని విశేషంగా చూరగొంటోంది. వెనుకటి కాలంలో ఈ ప్రాంతాన్ని "పిస్తాపురం"  అని సంబోధించేవారు. కాలక్రమంలో అదే "పిఠాపురం" గా  పిలవబడుతోంది.

శక్తిపీఠం(పురూహూతికా అమ్మవారు)గా, త్రిగయల్లో ఒకటి(పాదగయ)గా, పంచమాధవ క్షేత్రాల్లో విశిష్ఠమైనదిగా (కుంతీమాధవ క్షేత్రం) పేరొందింది. ఇంకా అనఘా దత్తక్షేత్రంగా, కుక్కుటేశ్వరస్వామి(శివ)  నిలయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.


త్రిగయలో ఒకటిగా విరాజిల్లుతున్న పాదగయని క్షేత్రం దక్షిణ కాశిగా పిలుస్తారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో గయాసుర అనే రాజు వద్దకు వచ్చి మాయోపాయంతో అతన్ని వధించి అతని కోరిక మేరకు మృతదేహాన్ని మూడుముక్కలు చెయ్యగా వాటిలో పాదలు పడిన చోటు పిఠాపురం పాదగయ శైవక్షేత్రం అయ్యింది. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.  ఆయన పక్కనుండే పార్వతిని రాజరాజేశ్వరిగాను భక్తులు కొలుచుకుంటారు.  ఈ పాదగయ నందు  తమ పితృదేవతలకు  చేయు పిండ ప్రదానం మరియు  తర్పణములవలన, వారి పితరులు నూరు తరముల వరకు తరించుదురు అని ఈ క్షేత్ర మహిమ తెలిసిన పెద్దవారు చెబుతారు. 





సతీదేవి పార్థివ శరీరాన్ని  విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా,  ఆ శరీరం 18 భాగాలుగా తెగి వేర్వేరు ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి పీఠభాగం పడిన చోటైన పిఠాపురంలో పురుహూతికాదేవి పదవశక్తి పీఠంగా విరాజిల్లుతోంది.









ఇంద్రుడు బ్రహ్మహత్యా దోష నివృత్తి కోసం అయిదు విష్ణుక్షేత్రాలు ప్రతిష్ఠించగా అవి పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అందులో ఒకటైన కుంతీమాధవక్షేత్రం పిఠాపురంలో ఉంది.


త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయుడు తన భక్తులు సుమతి, రాజశర్మ కోరిక మేరకు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మించడంతో పిఠాపురం ప్రముఖ దత్తక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది.

దివ్యక్షేత్రాల సంగమమైన పిఠాపురాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ క్షేత్రం కాకినాడకు 19 కిలోమీటర్ల దూరంలో వుంది. మద్రాస్-హౌరా బ్రాడ్ గేజ్ లైన్లో వెళ్లే రైళ్లన్నీ ఇక్కడ ఆగుతాయి.



20, జూన్ 2016, సోమవారం

Rajamahendravaram




Rajamahendravaram
 భారదేశంలో చారిత్రాత్మికంగా,రాజకీయ,ఆర్ధిక ,సంస్కృతీ పరంగా  తూర్పుగోదావరి జిల్లాకి ఒక ప్రత్యెక స్టానం వుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరం వీటన్నిటికి కేంద్రబిందువుగా భాసిల్లుతోంది. ఎన్నో సంఘ సంస్కరణలకు తోలి అడుగులు రాజమండ్రి లోనే పడ్డాయి.   క్రీ.శ.919 నుంచి 934 మధ్యకాలంలో రాజమహేంద్రవరం నగరాన్ని నిర్మించినట్టు చారిత్రక అధరాలు వున్నాయి.  తూర్పు చాళుక్యుల  రాజధానిగా రాజమండ్రి ఒక వెలుగు వెలుగొందింది. 

గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులన్నిటిలోను పెద్దది. దీనిని ప్రపంచంలో వున్న అతిపెద్ద నదుల్లో ఒకటిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల భూగర్భ సర్వే సంస్థ గుర్తించింది. ప్రాచీనకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో జైన, బౌద్ధాలు ఉజ్వలంగా ఉండేవి. ఈనాటి పంచారామాలు, అన్నవరం కొండ ఒకటినాటి బౌద్ధ క్షేత్రాలే అన్న వాదన కూడా వుంది.  


Dowleswaram barrage in Rajahmundry 
18 శతాబ్దంలో గోదావరి మీద నిర్మించిన ఆనకట్ట వల్ల రాజమండ్రి ముఖచిత్రమే మారిపోయింది. క్రీ.శ.1852లో గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్టను నిర్మించడంతో తూర్పు గోదావరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం కూడా మారిపోయింది. ఉభయగోదావరి జిల్లాలకు కాటన్ నిర్మించిన ఆనకట్ట ప్రాణాధారంగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా గోదావరి, తాండవ నదులు, బంగాళాఖాతం, తూర్పు కనుమలు ఉన్నాయి. గోదావరి నది జిల్లాను సారవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి గౌతమి, వశిష్ట నదులుగా చీలిపోయింది. ఈ మధ్య భూభాగంలో ఉన్న డెల్టా భూభాగాన్నే కోనసీమ అంటారు. గోదావరి రాజమండ్రిలో మొత్తం ఏడు పాయలుగా చీలి, అక్కడ నుండి సుమారు 100 కి.మీ ప్రయాణించి  బంగాళాఖాతంలో కలుస్తోంది. 


Sir Arthur Cotton
1844లో కాటన్ విశాఖపట్నంలో పని చేస్తుండేవారు. ఆ సమయంలోనే ప్రభుత్వం అడగకపోయినా ఆయన గోదావరి డెల్టా అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రూపొందించి పంపారు. డెల్టా ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ వస్త్ర కర్మాగారాలు మూసివేయడంతో ప్రజలు నష్టపోయారని, ప్రత్యామ్నాయంగా వరి, చెరుకు పంటలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కాటన్ సూచించాడు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. గోదావరి డెల్టాకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి నివేదిక పంపాలని ప్రభుత్వం కోరింది. 20 లక్షల ఎకరాల భూభాగంలో సర్వే చేశారు. రోజుకి 10 నుంచి 15 మైళ్లు గుర్రంపై తిరిగి కాటన్ సర్వే నిర్వహించేవారు. గోదావరి డెల్టా సర్వే నివేదిక 1845 ఏప్రిల్ 17న ప్రభుత్వానికి సమర్పించారు. ఆనకట్ట నిర్మాణం రూ.4.75లక్షల నిర్మాణ వ్యయంతో 1847 ఏప్రిల్లో ప్రారంభమైంది. 1852 నాటికి రూ.15 లక్షల వ్యయంతో గోదావరిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది.
Road cum Rail Bridge in Rajahmundry

 గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం జిల్లా జనాభా పెరుగుదలపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 1871 నాటికి అంటే ప్రాజెక్టు నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత జిల్లా జనాభా రెండు రెట్లు పెరిగి 15,92,939కి చేరింది. విశాఖ, గంజాం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా జిల్లాలో స్థిరపడ్డారు. అనంతర కాలంలో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. జిల్లాలోని రాజమహేంద్రి నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాయి. 2001లో 48,72,622 ఉన్న జనాభా 2011 నాటికి 51,51,549కి చేరింది.



Kandukuri Veeresalingam Pantulu's house in Rajahmundry


18, జూన్ 2016, శనివారం

East Godavari




తూర్పుగోదావరి మొత్తం విస్తీర్ణం 10,807 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా 51,51,549. దీనిలో  25,69,419 మంది మగవారు మరియు 25,82,130 మంది ఆడవారు (2011 జనాభా లెక్కలప్రకారం )

తూర్పు గోదావరి జిల్లాలో  7 రెవెన్యూ డివిజన్లు, 60 మండలాలు 1011 గ్రామపంచాయతీలు,1404 గ్రామాలు  వున్నాయి.

జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.

మండలాలు

1.అడ్డతీగల               21. కపిలేశ్వరపురం          41. రాజమండ్రి (అర్బన్‌)
2.అయినవిల్లి            22. కరప                            42. రాజానగరం
3.ఆలమూరు             23. కాట్రేనికోన                  44. రామచంద్రపురం
4. అల్లవరం               24. కిర్లంపూడి                   45. రంపచోడవరం
5. అమలాపురం         25. కోటనందూరు            46. రంగంపేట
6. అంబాజీపేట         26. కొత్తపల్లి                      47. రౌతులపూడి 
7. అనపర్తి                   27. కొత్తపేట                    48. రావులపాలెం
8. ఆత్రేయపురం        28. మలికిపురం              49. రాయవరం
9. బిక్కవోలు               29. మామిడికుదురు      50. రాజోలు
10. దేవీపట్నం           30. మండపేట               51. సఖినేటిపల్లి
11.గండేపల్లి                31. మారేడుమిల్లి           52. సామర్లకోట
12. గంగవరం             32. ముమ్మిడివరం         53. శంఖవరం
13. గోకవరం                33. నగరం                      54. సీతానగరం
14. గొల్లప్రోలు             34. పి.గన్నవరం            55. తాళ్ళరేవు
15. ఐ.పోలవరం         35. పామర్రు                   56. తొండంగి
16. జగ్గంపేట              36. పెదపూడి                57. తుని
17. కడియం                37. పెద్దాపురం               58. ఉప్పలగుప్తం
18. కాజులూరు            38. పిఠాపురం                59. వై.రామవరం  
19. కాకినాడ (రూరల్‌) 39. ప్రత్తిపాడు               60. ఏలేశ్వరం
20. కాకినాడ (అర్బన్‌) 40. రాజమండ్రి(రూరల్‌)

అసెంబ్లీ నియోజకవర్గాలు
1.తుని  2.ప్రత్తిపాడు  3.పిఠాపురం  4.కాకినాడ గ్రామీణం  5.పెద్దాపురం  6.అనపర్తి  7.కాకినాడ నగరం  8.రామచంద్రపురం  9.ముమ్మిడివరం  10.అమలాపురం  11.రాజోలు  12.పి.గన్నవరం  13.కొత్తపేట 14.మండపేట  15.రాజానగరం  16.రాజమండ్రి నగరం  17.రాజమండ్రి గ్రామీణం  18.జగ్గంపేట 19.రంపచోడవరం

పార్లమెంటరీ నియోజకవర్గాలు
1.కాకినాడ










2.అమలాపురం













3.రాజమండ్రి (పశ్చిమగోదావరి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, పోలవరం,  రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి)



జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.


13, జూన్ 2016, సోమవారం

పందెం కోళ్ళు


రెండు కోడి పుంజుల మధ్య జరిగే ఆధిపత్య పోరునే  "కోడి పందెం" అంటారు. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజులలో ఈ కోడిపందాలను నిర్వహిస్తారు.  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఈ పందాలను నిర్వహిస్తుంటారు. ఈ కోడి పందాలు అతి పురాతన కాలం నుండి  జరుగుతున్నట్టు  చరిత్రకారులు చెబుతారు. 

ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచిన  కోడిపుంజులను "పందెం కోళ్ళు" అని పిలుస్తారు . వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. కోళ్లు పుంజుల కాళ్లకు కత్తులు కట్టి.. కదన రంగంలోకి దింపితే.. రక్తం చిందిస్తూ.. వీరోచితంగా గెలుపుకోసం అవిచేసే పోరాటం అంతాఇంతా కాదు. తనను అప్యాయంగా చూసుకున్న యజమానిని గెలిపించడం కోసం ప్రత్యర్థి పుంజుతో అవి శక్తి కొద్ది పోరాడుతాయి. 


ఈ కోడి పందాలలో బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున మరియు శాంతిభద్రతల సమస్య ఉంటుందని, సంప్రదాయమైన ఈ క్రీడకు  ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అయినా కూడా  చాటుమాటుగా ఈ కోడి పందాలు నిర్వహిస్తారు. 



కోడి రంగును బట్టి ఈ పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు.  వీటిలో డేగ, కాకి ,నెమలి, పర్ల , చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు తెగల కోళ్లుంటాయి. సాధారణ కోడిపుంజులకు భిన్నంగా పందెం పుంజులు దృఢంగా ఉంటాయి. రంగు, సామర్థ్యాన్ని అనుసరించి దాన్ని పలానా తెగ అని గుర్తిస్తారు. ఎరుపు రంగులో ఉండే పుంజును డేగ అని, నీలం రంగులో ఉంటే కాకి అని పిలుస్తారు

ఈ కోడి పందాలు ప్రాచీన క్రీడ అయినందునే , ఈ క్రీడ గురించి తాళపత్ర గ్రంధాలు కూడా వున్నాయి. ఈ గ్రంధాలలో కోడిపుంజు లలో రకాలు, వాటి లక్షణాలు, ఏ పుంజుపై ఏ రకమైన పుంజుని  పందానికి దింపాలి అనే విషయాలు వీటిలో పొందు పరచబడి వున్నాయి.

ఇక ఈ పందెం కోళ్ళకు ఇచ్చే ఆహారం, శిక్షణ కూడా ప్రత్యేకంగా వుంటాయి. వీటికి ఇచ్చే ఆహారం కోసం తక్కువలో తక్కువగా వారానికి రెండు వేల రూపాయలు ఖర్చు వుంటుంది.  జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలు, దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి, పందెంపుంజుని దృఢంగా, ఏపుగా  తయారు చేస్తారు. ఇక పందెం దగ్గరపడే కొలదీ వాటికి తినిపించే ఆహారంలో కూడా మార్పులు చేస్తారు. 


బలమైన తిండితో పాటు పుంజుకి ఇచ్చే శిక్షణ కూడా చాల కఠినముగా వుంటుంది.  రన్నింగ్, స్మిమ్మింగ్, ఇతరత్రా శిక్షణలు అందజేస్తారు.  రోజూ ఉదయాన్నే కోడిపుంజును పరిగెత్తిస్తారు. కోడి బాగా అలసిపోయాక దాని నోట్లో నీరుకొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు. దీనివల్ల పోటీ సమయంలో కోడిపుంజు అలసిపోకుండా ఉంటుంది. అనంతరం పచ్చికోడిగుడ్డు తెల్లసొన తినిపించి కాసేపటి తర్వాత మరో అరగంట పరిగెత్తిస్తారు. తర్వాత కాసేపు విశ్రాంతి ఇస్తారు. అనంతరం జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్లజీలకర్ర, తెల్లజీలకర్ర, గసగసాలు దంచిన మిశ్రమాన్ని ముద్దగా తయారుచేసి కోడిపుంజులకు తినిపిస్తారు. కోడిపుంజు కొత్తశక్తిని సంతరించుకునేందుకు ఈ ఆహారం ఉపయోగపడుతుంది. భోజనానంతరం రెండు గంటలపాటు కోడికి విశ్రాంతి ఇస్తారు. ఆ తర్వాత సమీపంలోని వాగు లేదా చెరువుకి తీసుకువెళ్లి ఈత కొట్టిస్తారు. రోజంతా ఈ ఎక్సర్సైజుల వల్ల కోడి ఓంట్లో నొప్పులు చేరితే తీసివేసేందుకు బాడీ మసాజ్ చేస్తారు. కట్టెల మంటపై మట్టిపిడత ఉంచి దాన్ని వేడిచేస్తారు. ఆ వేడిని ఓ గుడ్డకు పట్టించి ఆ గుడ్డతో కోడి తలకు, ఒంటికి, కాళ్లకు మసాజ్ చేస్తారు. దీనివల్ల కోడి ఒంట్లో ఎక్కడైనా నొప్పులు ఉంటే అవి పోవడానికి ఈ మసాజ్ ఉపకరిస్తుంది. రాత్రికి కూడా మంచి ఆహారం పెట్టి విశ్రాంతి ఇస్తారు.

కత్తి పందాలు, డింకీ పందాలు  అని రెండు రకాలుగా ఈ కోడిపందాలు  జరుగుతాయి. 

కత్తి పందెం: పోటీల్లో పాల్గొనే కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలో దించితే దాన్ని కత్తిపందెం అంటారు. పోటీ పుంజుల్లో కత్తిదెబ్బ కాచుకుని చివరి వరకు ఏ పుంజు నిలుస్తుందో అది విజేత అవుతుంది. ఈ పందెంలో కత్తిగాటుపడి పందెంకోళ్లు మృత్యువాత పడుతుంటాయి. చాలా తక్కువ సమయంలో ఈ పోటీలో ఫలితం వస్తుంది. 

డింకీ పందెం: కోడి పుంజులను మామూలుగా బరిలోకి దింపితే దాన్ని డింకీ పందెం అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రెండు కోళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఈ పోటీలో ఫలితం ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుంది. కత్తిపందాల్లో పాల్గొనే పుంజుల కంటే డింకీ పందాల్లో పాల్గొనే పుంజులు చాలా దృఢంగా ఉంటాయి. 

పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉంటారు.  నిర్వాహకులయితే  పందెం సొమ్ములో 10 శాతాన్ని తీత గా వసూలు చేస్తారు, ఇది నిర్వాహకుల లాభం.

పందెం పుంజుల ధర విషయానికొస్తే వేలనుంచి లక్షలలో వుంటాయి. 







10, జూన్ 2016, శుక్రవారం

గోదావరి - మత్యసంపద



జీవనది గోదావరి అనంతమైన మత్యసంపదకు నిలయం. ఈ గోదావరి మీద ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. గోదావరి నది నీటిలో దొరికే రకరకాల చేపలు అంటే ఎవరికైనా మక్కువే. సుమారు 1500 కి.మీ నిడివి కలిగిన గోదావరి నది, సముద్రంలో కలిసే వరకు అనంతమైన మత్యసంపదకు నిలయం. ఎలాంటి వారైన గోదావరి చేపల రుచికి దాసోహం అనవలసిందే.

Pulasa
గోదావరి చేపలు అనగానే ముందు గుర్తుకొచ్చేది పులస చేప . ఇది తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే దొరికే అరుదైన చేప. వేరే ఖండాలనుండి సుదూరము ప్రయాణం చేసి  గోదావరినదిలోకి వలసవచ్చే విదేశీ అతిధి ఈ పులస. బంగాళాఖాతం లో వుండగా ఇలసగా పిలవబడే ఈ చేప, గోదావరికి వరద నీరు రాగానే ఆ నీటిలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు వీటిని పులసలుగా పిలుస్తారు. ఇవి గోదావరి బంగాళాఖాతం లో కలిసే ప్రదేశం నుండి ధవళేశ్వరం బ్యారేజీ వరకు వుండే గోదావరి నీటిలో మాత్రమే  దొరుకుతాయి. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. రుచికరమైన చేపలలో దీనిది ప్రధమస్థానం. 

పండుగొప్ప, ఇది గోదావరి నీటిలోను మరియు  పంట కాలువల్లో కూడా పెరుగుతుంది 


Chiramenu
ఉప్పుటేరులో రామలు, రొయ్యలు, పీతలు వంటివి విరివిగా దొరుకుతాయి. గోదావరి నీటికాల్వల్లో బొమ్మిడాయలు లభిస్తాయి. వీటితో పాటు అనేక రకాల తినే పాములు లభ్యమవుతాయి. గోదావరిలో కార్తీక మాసం సమయంలో లభ్యమయ్యే ‘చీరమేను’కు చాలా డిమాండు ఉంటుది . ముఖ్యంగా  పండుగొప్పలు, కట్టిపరిగలు, కొయ్యింగలు, దొందులు, జెల్లలు, పీతలు, రొయ్యలు, మెత్తళ్లు, గుడ్డాకురాయిలు, మాగలు, మార్పులు, జెల్లలు, వంజరం, బంగారు తీగ,తుళ్ళు, ఇంగిలాయిలు, వాలుగలు, బొమ్మిడాయలు, బొచ్చులు మరియు పాముజాతిచేపల్లో మలుగు, తెంబేలు వంటి రకాలు, తాబేళ్లు వంటి వివిధ  మత్స్య ఉత్పత్తులు గోదావరి నది ద్వారా లభ్యమవుతాయి.  

ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతులవుతాయి. దీని ద్వారా చేపల వేటదారులు భారీ లాభార్జనలు చేస్తారు.   కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయల వెంబడి నిత్యం చేపల వేటే ప్రధాన వృత్తిగా అనేక మత్స్యకారులు కుటుంబాల వారు బతుకుతున్నారు. వేకువజామునే పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా నదీపాయల్లో మత్స్యసంపదను వేటాడుతూ జీవనం సాగించే మత్స్యకార పల్లెలు కోనసీమలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వీరు గ్రామ, మండలాల వారీగా ఆయా సముద్రపాయల్లో హద్దులు నిర్ణయించుకుని నదుల్లో మత్స్య సంపదపై సర్వహక్కులు కలిగి ఉంటారు. 

9, జూన్ 2016, గురువారం

Maredumilli - The Eco Tourism place

Maredumilli Forest
తూర్పుగోదావరి జిల్లాలో పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) ప్రదేశం "మారేడుమిల్లి". మన్యం (ఏజెన్సీ) ప్రాంతమైన మారేడుమిల్లి తూర్పు కనుమలలో ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. ఇది రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుండి సుమారు 80 కి.మీ. దూరంలో వుంది. రాజమహేద్రవరం నుండి డైరక్టు బస్సు సౌకర్యం వుంది.  పర్యావరణ పర్యాటక రంగాన్ని (ఎకో టూరిజం) అభివృద్ధి చేసే పనిలో భాగంగా వనసంరక్షణ సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖలు కలసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులలో భాగంగా మారేడుమిల్లి మరియు చుట్టుపక్కల అడవులలో "వాల్మీకి వ్యాలి వన విహారస్థలి"  అనే పేరుతొ అభివృద్ధి చేసిన ప్రాంతం టూరిస్టులను బాగా ఆకర్షిస్తోంది.

ఇప్పుడు ఒకసారి మారేడుమిల్లిలో విహరిద్దాము. 

Jalatharangini Waterfall


జలతరంగిణి జలపాతం... ఇది మారేడుమిల్లి నుండి సుమారు 8కి.మీ దూరంలో దట్టమైన అడవిలో వుంటుంది. ఎత్తైన కొండలమీద నుంచి కిందకు దూకుతున్న ఈ జలపాతాన్ని చూసి తీరాల్సిందే. 
Swarnadhara Waterfall
Madanikunj

ఇదే కాకుండా మారేడుమిల్లి నుండి 16 కి.మీ దూరంలో స్వర్ణధార, అమృతధార అనే జంట జలపాతాలు చూడతగ్గవి.  ఇక మారేడుమిల్లి నుంచి 10కి.మీ దూరంలో వుండే మదణ్కుంజ్ అనే ప్రదేశం లో పైన్ వృక్షాలు అంబరాన్ని చుమ్బిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. 

Jungel Star

ఇక్కడ చూడదగ్గ మరోప్రదేశం పాములేరు. ఇది కూడా మారేడుమిల్లి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ ప్రవహించే పాములేరు వాగు చెంతకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. కార్తీకమాసంలో ఈ ప్రాంతం సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ఇక్కడే జంగిల్స్టార్ నేచురల్ క్యాంప్ను ఏర్పాటుచేశారు. వేటపట్ల ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి విశేషాలను వివరించేందుకు వనసంరక్షణసమితి సభ్యులు సహకరిస్తారు. క్యాంపులో గడిపేందుకు 20 మందిని ఒక జట్టుగా చేసి వాళ్లకు గుడారాలు కేటాయిస్తారు.  ఈ గుడారాలలో  రాత్రిపూట గడపవచ్చు. ఇక పర్యాటకుల కోరిక మేరకు క్యాంపు ఫైర్ని కూడా ఏర్పాటు చేశారు. 

తరువాత చూడదగ్గది నందనవనం అని పిలవబడే ప్రదేశం . ఇక్కడ కాలువలమీద వెదురు వంతెనలు నిర్మించారు మరియు  పర్యాటకులు సేదతీరేందుకు వెదురు గుడిసెల్ని నిర్మించి వాటిలో  వెదురుతో తయారుచేసిన  ఫర్నీచరు తో అలంకరించారు. 

పుష్పాంజలి ఉద్యానవనం, కాఫీ, రబ్బరు,. మిరియాలు, కమలాతోటలు, ఔషధమొక్కలు ఈ ప్రాంతంలోని అదనపు ఆకర్షణలు. 


Vali Sugriva Medical Plants

బోడికొండల దగ్గర సహససిద్ధంగా పెరిగిన  వాలిసుగ్రీవనం,సుమారు 125 జాతుల మొక్కలతో  సైన్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా వుంది .  బొటానికల్ టూర్ చేసే విద్యార్ధులకి  ఇది  చాలా ఉపయోగపడుతుంది. 

Bongu Chicken

మారేడుమిల్లి అంటే ముఖ్యంగా చెప్పుకోతగ్గది బొంగు చికెన్. ఈ మన్య ప్రాంతంలో చేసే ఈ ప్రత్యెక  వంటకం పసందైన రుచే కాకుండా , ఆరోగ్యానికీ కూడా ఎంతోమంచిదని ఇక్కడివాళ్ళు చెబుతారు. దీనిని తయారుచేసే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుది. ముందుగా కోడిమాంసం ముక్కలకు మసాలా, పచ్చిమిర్చి మిశ్రమాల్ని పట్టించి, ఒక వైపు తెరిచిన వెదురుబొంగులో ఉంచి అడ్డాకులతో మూతిని మూసి నిప్పులమీద సుమారు గంటసేపు కాల్చుతారు.  

 పర్యాటకుల కోసం డీలక్స్, బైసన్ పొదరిళ్లు, కంటైనర్ కాటేజీలు, ఏసీలున్న హిల్టాప్ ఇళ్లూ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గిరిజనులే గైడ్లగా వ్యవహరిస్తారు.  ఆహారపు ఏర్పాట్ల నుంచీ అన్ని పనులూ వారే చేసి పెడతారు. ఆన్ లైన్ లో  మారేడుమిల్లి యాత్రని బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం వాళ్ళ  ఆస్ట్రియా, ఫ్రాన్స్, చైనా, అమెరికాల నుంచి పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. 

ముఖ్యం చెప్పుకోతగ్గది విషయం, ఈ ప్రాజెక్టు కారణంగా గిరిజనులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ లబ్ధి చేకూరుతోంది.




6, జూన్ 2016, సోమవారం

తూర్పుగోదావరి జిల్లా - పంటలు

తూర్పుగోదావరి జిల్లాలో వరి,కొబ్బరి, చెఱుకు,పత్తి,మొక్కజొన్న, పామాయిల్, అపరాలు మొదలైన పంటలు పండుతాయి.  ఇక్కడ నల్లరేగడి, ఇసుక, ఎర్రనేలలు తదితర చాలా రకాల సాగునేలలు ఉన్నాయి. నేలల స్వభావాన్ని బట్టి పంటలు సాగు అవుతాయి. 

 వరి 
తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట ప్రధానమైన పంట . జిల్లాలో  4.50 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తున్నారు.  మొత్తం గోదావరి డెల్టాలో పండే వరిలో 40 శాతం తూర్పుగోదావరి జిల్లాలో పండుతోంది. ఇక్కడ ఖరీఫ్, రబీల్లో వరిని ప్రధాన పంటగా సాగుచేస్తారు.  కోనసీమలో ప్రధానంగా సాగుచేస్తున్న వరి పంటకు గోదావరి నీరే ఆధారం. ధవళేశ్వరం బారేజ్ కాలువల  ద్వారా  వచ్చే గోదావరి నీళ్ళతో  గోదావరి డెల్టాలోని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలలో ఈ పంటను సాగుచేస్తున్నారు.





కొబ్బరి 

తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1.25లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ముఖ్యంగా ఈ పంట కోనసీమలో కేంద్రీకృతమై ఉంది. సుమారు 70లక్షల కొబ్బరి చెట్లు ఇక్కడ ఉన్నాయి. కొబ్బరి  తోటలతో పాటు చేలగట్ల మీద కూడా కొబ్బరిచెట్లను ఎక్కువగానే పెంచుతున్నారు.  ఇక్కడ పండిన కొబ్బరి దేశంలోని నలుమూలలకూ ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.
  
కొబ్బరి పంటపై పరిశోధన చేసేందుకు గాను జిల్లాలోని అంబాజీపేటలో  కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. కొబ్బరి పంటకు వ్యాపిస్తున్న తెగుళ్లు, పురుగుల నివారణకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలోనే  ఏర్పాటైన ఏకైక పరిశోధనా కేంద్రం అంబాజీపేట ఉద్యాన ( కొబ్బరి) పరిశోధన కేంద్రం. 1955 సంవత్సరంలో  ఈ కేంద్రాన్ని, 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. ముఖ్యంగా కొబ్బరి పంటకు వ్యాపించే తెగుళ్లు, పురుగుల నివారణకు ఇక్కడ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు. క్రొత్త రకాల కొబ్బరిమొక్కలను  సృష్టిస్తున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో  కొబ్బరిమార్కెట్టుకు పెట్టింది పేరు అంబాజీపేట. ఇక్కడ ప్రతి బుధ, గురువారాలు కొబ్బరిసంత జరగుతుంది, లక్షలాది రూపాయల్లొ  వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కొబ్బరి, కొత్తకొబ్బరి, కురిడీ కొబ్బరికి సంబంధించి వ్యాపార లావాదేవీలు నడుస్తాయి.  కురిడీ వ్యాపారుల సంఘం, కొబ్బరి వర్తక సంఘాలతో పాటు కొబ్బరిరైతులను చైతన్యం చేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ నేతృత్వంలో అంబాజీపేట కేంద్రంగా రైతు సంఘం ఉంది.


అరటి

గోదావరి లంకల్లోనూ, కొబ్బరి తోటల్లో అంతరపంటగాను జిల్లాలో అరటి పంట విరివిగా సాగవుతుంది. అరటి పంటకు కోనసీమ ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని మిగతా ప్రాంతాలకు వచ్చేసరికి మెట్టలో ముఖ్యంగా కోటనందూరు మండలంలో అరటి పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నారు. ఏటా రూ.500ల కోట్ల విలువైన అరటి పంట పండుతోది. జిల్లాలోని రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్ ద్వారా ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ ఆసియాలోనే అతి పెద్ద మర్కెట్ గా పేరుగాంచింది. కోనసీమలో పండిన అరటి పంటను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
  

చెఱుకు 
జిల్లాలోని దాదాపు 35 వేల ఎకరాల్లో చెఱుకు పంట  సాగువుతోంది.  వచ్చిన పంటలో అధిక భాగం చక్కెర పరిశ్రమలకు చేరుతుంది. దిగుబడిలో 10% మాత్రమే  రైతులు స్వయంగా బెల్లం తయారు చేస్తుంటారు. కిర్లంపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఈ ప్రక్రియ అధికంగా సాగుతోంది. పండించడానికి వ్యయం అధికంగా అవ్వడం మరియు  దీర్ఘకాలిక పంట కావడంతో చెరకు సాగుపై గతంలో కన్నా మక్కువ తగ్గింది.





పత్తి 


జిల్లాలో సుమారు  30వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం, తుని, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. 










మొక్కజొన్న

జిల్లాలోని సీతానగరం మండలంలో అధికంగా మొక్కజొన్నను సాగు జరుగుతున్నది. మొక్క జొన్నను   ఎక్కువగా కోళ్ల మేతలో వినియోగిస్తారు. జిల్లాలో కోళ్ల పరిశ్రమ అధికంగా ఉండడంతో పండిన మొక్కజొన్న స్థానికంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి.  









అపరాలు  

మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి ఖరీఫ్ సీజన్లో 14వేల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రబీ సీజన్లో మాత్రం డెల్టా, కోనసీమ ప్రాంతాలలో అధికంగా అపరాల సాగును చేపడతారు. అపరాల సాగుకు నామమాత్రపు నీటి తడులు సరిపోవడంతో నీటి ఎద్దడి సమయంలో మినుము, పెసల సాగుకే ప్రాధాన్యతను ఇస్తారు.







పామాయిల్  

జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఈ పంటకు పెట్టుబడి తక్కువగా ఉండటము మరియు కూలీల అవసరం అంతగా అవసరం లేకపోవడంతో రైతులు ఈ పంటపై బాగా శ్రద్ద చూపిస్తున్నారు.