![]() |
| Uppada saree |
ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము. ఈ వూరు కాకినాడ వాకలపూడి లైట్ హౌస్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో వుంది, పిఠాపురం నుంచి కూడా ఈ వూరు చేరవచ్చు. జరీ తోచేయబడిన "జామదాని" చీరల నేతకు ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. వీటిని "ఉప్పాడ చీరలు" అని కూడా అంటారు. చేనేత వస్త్రాల తయారీలో ఈ ఉప్పాడ గ్రామానికి మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జమ్‌దానీ చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జమ్‌దానీ చీరలకు ఉప్పాడ కేరాఫ్ అడ్రసు గా మారింది. చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం.. 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశస్థాయిలో ప్రాచుర్యం పొందింది.
జమ్‌దానీ అనేది బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప చేనేత కళ. "జమ్‌దానీ" అనే పదం పర్షియన్ భాషలోనిది. ఆ భాషలో "జమ్" అంటే పువ్వు అని అర్థం. జమ్‌దానీ సంప్రదాయ నేత కళను యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించింది.ఇంత ప్రాచుర్యం ఉన్న ఉప్పాడ చీరల వెనుక చేనేత కార్మికుల కఠోర శ్రమ అంతా ఇంతా కాదు. మగ్గంపై నిర్విరామంగా 10 గంటలు పనిచేస్తే అరమీటరు చీర ఉత్పత్తి చేయగలుగుతారు . జమ్‌దానీ చీర తయారీకి 10 రోజుల నుండి రెండు నెలల వరకు పడుతుంది. ఈ చీర తయారీకి ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు రోజుకు 10 గంటలు నిర్విరామంగా శ్రమిస్తారు. ఈ చీరను నేసేందుకు డిజైన్ వేసుకోవడం.. సిల్క్ దారాలు అల్లడం.. మగ్గంపై నేయడం వంటి పనులకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తారు.
ఈ చీరల తయారీలో స్వచ్చమైన జరీతో పాటు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సన్నటి పట్టును వినియోగిస్తారు. అన్ని పట్టువస్త్రాల మాదిరిగా కాకుండా ఈ చీరపై ఉన్న డిజైన్ చీరకు ఇరువైపులా ఒకేలా ఉండడం దీని విశిష్టత. అంతేగాక కంచి, ధర్మవరం పట్టుచీరల కంటే ఈ ఉప్పాడ జమ్‌దానీ చీరలు బరువు తక్కువగా ఉంటాయి .














































