19, జులై 2016, మంగళవారం

ARTOS - GODAVARI'S FAMOUS SOFTDRINK


భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, మొత్తం దేశంలో  7 సంస్థలు మాత్రమే సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి. కలకత్తా కేంద్రంగా  బెహరాన్ కంపెనీ , మద్రాస్ కేంద్రంగా  స్పెన్సర్స్ కంపెనీ , ముంబాయ్ నుంచి డ్యూకో కంపెనీ , డిల్లీ నుంచి రోజర్స్ కంపెనీ , హైదరాబాద్ నుంచి అల్లాఉద్దీన్ కంపెనీ , మధురై నుంచి విన్సెంట్ కంపెనీ ,తూర్పుగోదావరిజిల్లా  రామచంద్రపురం నుంచి ఎ.ఆర్.రాజు కంపెనీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి. ఆ తర్వాత కాలంలో వివిధ కారణాలవల్ల …. రామచంద్రపురం ఏ.ఆర్.రాజు కంపెనీ (ఆర్టోస్) తప్ప  మిగిలిన సంస్థలన్నీ కనుమరుగయ్యాయి.



బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమంటే మాటలు కాదు. వేల కోట్ల రూపాయల ప్రచారం... టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు... పోటీ పడలేని స్థాయిలో మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఒకెత్తయితే ప్రత్యర్థులు ఊహించని ఆఫర్లిచ్చి వారిని పడేయటం మరొకఎత్తు. థమ్స్ అప్, గోల్డ్స్పాట్, లిమ్కా వంటి సూపర్ బ్రాండ్లతో లీడర్గా ఉన్న పార్లే సైతం మార్కెట్లో వెనకడుగు వేసిందంటే ఇలాంటి ఆఫర్ల వల్లే!. అలాంటి ఆఫర్లకు సైతం పడకుండా పోటీని తట్టుకుంటూ... తమ బ్రాండ్ ఇమేజ్ ని  కాపాడుకుంటూ వస్తున్న  ‘లోకల్’  మెరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి మెరుపే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్టోస్ కూల్ డ్రింక్ . ఇది తూర్పు గోదావరి  బ్రాండ్. ఇది గోదావరి జిల్లాల ప్రజల అభిమాన శీతల పానీయం.

గోదావరిజిల్లాల ఆరాధ్యుడు,అపర భగీరధుడు .... సర్ ఆర్ధర్ కాటన్... ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు లండన్ నుంచి తెచ్చుకున్న సోడా మెషిన్ని ధవళేశ్వరం లోనే వదిలి వెళ్ళిపోయారు . ఆ మెషినే ఆర్టోస్ కంపెనీ కి భీజం వేసింది.


a


తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో 1912 లో ఎ.ఆర్. రాజు బ్రదర్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఉత్పత్తి మొదలు పెట్టారు.ఆ కంపెనీ 1955 నాటికి ఆర్టోస్ గా అవతరించింది.1912లో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తున్న సమయంలో బ్రిటిష్ మిలిటరీ పెద్ద ఎత్తున రామచంద్రపురానికి వచ్చేది. వారికి ‘గోలీ సోడా’లు అందించటమే అడ్డూరి రామచంద్రరాజు వ్యాపారం. అలా... వారికి దగ్గరైన రాజు... వారి సహకారంతోనే బ్రిటన్ నుంచి కూల్ డ్రింక్స్  తయారీకి సంబంధించిన యంత్రాలను, ముడి సరుకులను తెప్పించుకున్నారు. 1919లో ఏఆర్ రాజు కూల్ డ్రింక్స్ పేరిట  వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ లేఖల రూపంలోనే జరిగాయి. 1955లో పూర్తి స్థాయిలో  ‘ఆర్టోస్’ కూల్ డ్రింక్ వ్యాపారం మొదలైనది.  అదే ఏడాది దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని  రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారు చేస్తారు. కూల్ డ్రింక్‌లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించింది. 5 రకాల ఫ్లేవర్స్ లో 'ఆర్టోస్' కూల్ డ్రింక్స్ లభిస్తున్నాయి. 




అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి పోటీని తట్టుకుంటూ, రుచిలోనూ, నాణ్యత లోను తన ప్రత్యేకత చాటుకుంటున్న మన గోదావరి బ్రాండ్ ఈ "ఆర్టోస్" కూల్ డ్రింక్  .   




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి