19, జులై 2016, మంగళవారం

ARTOS - GODAVARI'S FAMOUS SOFTDRINK


భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, మొత్తం దేశంలో  7 సంస్థలు మాత్రమే సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి. కలకత్తా కేంద్రంగా  బెహరాన్ కంపెనీ , మద్రాస్ కేంద్రంగా  స్పెన్సర్స్ కంపెనీ , ముంబాయ్ నుంచి డ్యూకో కంపెనీ , డిల్లీ నుంచి రోజర్స్ కంపెనీ , హైదరాబాద్ నుంచి అల్లాఉద్దీన్ కంపెనీ , మధురై నుంచి విన్సెంట్ కంపెనీ ,తూర్పుగోదావరిజిల్లా  రామచంద్రపురం నుంచి ఎ.ఆర్.రాజు కంపెనీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి. ఆ తర్వాత కాలంలో వివిధ కారణాలవల్ల …. రామచంద్రపురం ఏ.ఆర్.రాజు కంపెనీ (ఆర్టోస్) తప్ప  మిగిలిన సంస్థలన్నీ కనుమరుగయ్యాయి.



బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమంటే మాటలు కాదు. వేల కోట్ల రూపాయల ప్రచారం... టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు... పోటీ పడలేని స్థాయిలో మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఒకెత్తయితే ప్రత్యర్థులు ఊహించని ఆఫర్లిచ్చి వారిని పడేయటం మరొకఎత్తు. థమ్స్ అప్, గోల్డ్స్పాట్, లిమ్కా వంటి సూపర్ బ్రాండ్లతో లీడర్గా ఉన్న పార్లే సైతం మార్కెట్లో వెనకడుగు వేసిందంటే ఇలాంటి ఆఫర్ల వల్లే!. అలాంటి ఆఫర్లకు సైతం పడకుండా పోటీని తట్టుకుంటూ... తమ బ్రాండ్ ఇమేజ్ ని  కాపాడుకుంటూ వస్తున్న  ‘లోకల్’  మెరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి మెరుపే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్టోస్ కూల్ డ్రింక్ . ఇది తూర్పు గోదావరి  బ్రాండ్. ఇది గోదావరి జిల్లాల ప్రజల అభిమాన శీతల పానీయం.

గోదావరిజిల్లాల ఆరాధ్యుడు,అపర భగీరధుడు .... సర్ ఆర్ధర్ కాటన్... ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు లండన్ నుంచి తెచ్చుకున్న సోడా మెషిన్ని ధవళేశ్వరం లోనే వదిలి వెళ్ళిపోయారు . ఆ మెషినే ఆర్టోస్ కంపెనీ కి భీజం వేసింది.


a


తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో 1912 లో ఎ.ఆర్. రాజు బ్రదర్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఉత్పత్తి మొదలు పెట్టారు.ఆ కంపెనీ 1955 నాటికి ఆర్టోస్ గా అవతరించింది.1912లో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తున్న సమయంలో బ్రిటిష్ మిలిటరీ పెద్ద ఎత్తున రామచంద్రపురానికి వచ్చేది. వారికి ‘గోలీ సోడా’లు అందించటమే అడ్డూరి రామచంద్రరాజు వ్యాపారం. అలా... వారికి దగ్గరైన రాజు... వారి సహకారంతోనే బ్రిటన్ నుంచి కూల్ డ్రింక్స్  తయారీకి సంబంధించిన యంత్రాలను, ముడి సరుకులను తెప్పించుకున్నారు. 1919లో ఏఆర్ రాజు కూల్ డ్రింక్స్ పేరిట  వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ లేఖల రూపంలోనే జరిగాయి. 1955లో పూర్తి స్థాయిలో  ‘ఆర్టోస్’ కూల్ డ్రింక్ వ్యాపారం మొదలైనది.  అదే ఏడాది దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని  రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారు చేస్తారు. కూల్ డ్రింక్‌లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించింది. 5 రకాల ఫ్లేవర్స్ లో 'ఆర్టోస్' కూల్ డ్రింక్స్ లభిస్తున్నాయి. 




అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి పోటీని తట్టుకుంటూ, రుచిలోనూ, నాణ్యత లోను తన ప్రత్యేకత చాటుకుంటున్న మన గోదావరి బ్రాండ్ ఈ "ఆర్టోస్" కూల్ డ్రింక్  .   




3, జులై 2016, ఆదివారం

Godavari Ruchulu (ఉభయగోదావరి రుచులు)


ఆత్రేయపురం పూతరేకులు ... పెరుమాళ్లపురం పాకం గారెలు...  కాకినాడ కోటయ్య కాజా... తాపేశ్వరం పాకం కాజాలు... కోనసీమకు ప్రత్యేకత తెచ్చిన అంబాజీపేట పొట్టిక్కలు... హైదరాబాద్ బిర్యానీని తలదన్నే రావులపాలెం ముంత బిర్యానీ ... అమోఘమైన రుచిగల కండ్రిక పాలకోవాలు...పాకం కారుతూ నోరు తీపి చేసే పెనుగొండ కజ్జికాయలు ... విదేశాలకు సైతం తరలివెళ్లే భీమవరం నాన్వెజ్ పచ్చళ్లు... ఇలా చెప్పుకుంటూపోతే మన గోదావరి రుచులకు అంతేలేదు.  మన గోదావరి రుచులే వేరబ్బా...!! 

ఇక ఒకొక్కటిగా రుచిచూద్దాం పదండి.........
--------------------------------------------------------------------------------------------------------------------------
తాపేశ్వరం కాజా... 


తాపేశ్వరం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కాజా. తాపే శ్వరం కాజాకు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగానూ, దేశవ్యాప్తం గానూ మంచి పేరు ఉంది. ఈ కాజాను చూడగానే ఎవరికైనా నోరూరక తప్పదు. ఈ ప్రాంతంలో జరిగే ఏ శుభకార్యంలో నైనా తాపేశ్వరం కాజా ఉండాల్సిందే. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద బ్రహ్మపురి గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు కుటుంబంతో కలిసి తాపేశ్వరం గ్రామానికి వలసొచ్చారు. అప్పట్లో మిఠాయి రామస్వామి వద్ద ఆయన పనిచేశారు. కొంత కాలానికి రామస్వామి తనవ్యాపారాన్ని ఆపేశాడు. దీంతో సత్తిరాజు తాపేశ్వరంలో హోటల్ను స్థాపించారు. ఆ అనుభవంతో కాజాలను తయారుచేసి అమ్మేవాడు. ఈ కాజాల రుచి, నాణ్యత బాగుండటంతో ప్రజల్లో కాజాపట్ల మక్కువ ఏర్పడింది. నాటి నుంచీ ఈ కాజాలకు ప్రత్యేకత చాటుకుంది. 1970 దశకంలో సత్తిరాజు హోటల్ను తొలగించి పూర్తిస్థాయిలో మిఠాయి దుకాణాన్ని అభివృద్ధి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరికివారు షాపులను ఏర్పాటు చేసుకున్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తాపేశ్వరం కాజా పేరుతో జీవనోపాధి పొందుతున్నారు. శ్రీ భక్తాంజనేయ స్వీట్స్టాల్స్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా షాపులు వెలిశాయి. ఇంటర్నెట్ వెబ్సైట్లలోనూ తాపేశ్వరం కాజా పేరు మారుమోగుతోంది. 
--------------------------------------------------------------------------------------------------------------------------
ఆత్రేయపురం పూతరేకులు.. 




పూతరేకులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది ఆత్రేయపురం. ఇక్కడ తయారయ్యే పూతరేకులకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. 30 ఏళ్ల క్రితం నుంచే ఈ వంటకాన్ని ఇక్కడి మహిళలు జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమవంటకానికి మరింత రుచిని జోడిస్తూ రాణిస్తున్నారు. ఒక ఆత్రేయపురంలోనే కాక లొల్ల, అంకంపాలెం, తాడిపూడి, నార్కేడుమిల్లి, ఉచ్ఛిలి తదితర ప్రాంతాల్లోనూ ఈ వంటకం వ్యాపించింది. పంచదార, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పొడి వంటి వాటిని రంగరించి మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారు కచ్ఛితంగా రుచిచూడాల్సిన ఆహారా పదార్థాల్లో ఇదొకటి. 
--------------------------------------------------------------------------------------------------------------------------
రావులపాలెం ముంతబిర్యానీ...


హైదరాబాద్ దమ్ బిర్యానీని సైతం మైమరిపించే బిర్యానీ కోనసీమ ముఖ్య ద్వారామైన రావులపాలెంలో ఉంది. ఇక్కడ ముంతబిర్యానీ అంటే అందరికీ నోరూరక తప్పదు. బిర్యానీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటూ వారి మనసును దోచేస్తుంది. 2005లో రావులపాలెంలోని ఒక రెస్టారెంట్లో ముంతలో వేసి బిర్యానీ అమ్మకం ప్రారంభమైంది. క్రమేపీ ఆదరణ పెరగడంతో ప్రస్తుతం రావులపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం ముంత బిర్యానీ విశేషంగా విక్రయిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహన చోదకులు తప్పకుండా ముంత బిర్యానీ కొనుగోలు చేసి తినిమరీ వెళుతుంటారు. 
--------------------------------------------------------------------------------------------------------------------------
అంబాజీపేట పొట్టిక్కలు...


ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిం చడంలో పొట్టిక్కలు ప్రధానపాత్ర పోషిస్తాయి. కోనసీమలోని అంబాజీపేట, అమలాపురం పరిసర ప్రాంతాల్లో అతికొద్ది మంది మాత్రమే అమ్ముతుంటారు. వీటికి చాలా ప్రత్యేకత ఉంది. వీటిని తినేందుకు ఎక్కడ నుంచో ఇక్కడికి వస్తారు. ప్రధానంగా అంబాజీపేటలో వీటిని తయారుచేసి సమీప ప్రాంతాలైన అమలాపురం, రావులపాలెం, కొత్తపేట, గన్నవరం ప్రాంతాల్లో ఉండే హోటళ్లకు తరలిస్తారు. రోజుకు రూ.1,500- 2,000 వరకూ పొట్టిక్కలు అమ్ముడవుతాయి. అంతేగాక ఈ పొటిక్కలకు సంబంధించి పనస ఆకుల తయారీతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 
--------------------------------------------------------------------------------------------------------------------------
కాకినాడ కోటయ్య కాజా...


1901 సంవత్సరంలో కోటయ్యగారు ఈ  కాకినాడ కాజా రుచిని ప్రజలకు మొదటిసారిగా అందించారు. ఇవి తాపేశ్వరం మడత కాజాలు వంటివి కావు. కోలగా దొండకాయలాగా ఉంటాయి. కొరకగానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తోంది. వీటిని గొట్టం కాజాలూ అనిఅంటారు. మొదట జిల్లావ్యాప్తంగా తర్వాత రాష్ట్రం, అనంతరం దేశవ్యాప్తంగా ఈ కాజాలు ఖ్యాతిగాంచాయి. దీన్ని తయారు చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించినా కోటయ్య కాజా రుచి ఎవరూ తీసుకురాలేకపోయారు. మొదట్లో చేత్తోనే తయారు చేసేవారు. కోటయ్యగారే స్వయంగా ఇంటింటికీ తిరిగి అమ్మేవారు. అనంతరం ఒక చోట షాపుపెట్టి అభివృద్ధి చేశారు. ఇప్పుడు యంత్రాలతోనూ కాజాను తయారు చేస్తున్నారు. కోటయ్య గారి మూడో తరం వ్యక్తులు ప్రస్తుతం షాపును నడుపుతున్నారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
 పెరుమాళ్ల పురం పాకం గారెలు...
వింటే మహాభారతం వినాలి, తింటే గారిలే తినాలనేది అనేది నానుడి. తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి మండలం తీర ప్రాంత గ్రామమైన పెరుమాళ్ల పురం, పాకం గారెలకు ప్రసిద్ధి. ఐదు దశాబ్ధాలుగా ఈ గారెలను ఇక్కడ తయారు చేస్తున్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెరుమాళ్లపురం పాకం గారెలను ఎంతో ఇష్టంగా తింటారు. 60 ఏళ్ళ కిందట పేరూరి అప్పాయమ్మ పెరుమాళ్ళపురంలో ఈ బెల్లం గారెలు తయారిని ప్రారంభించారని చెబుతారు. నాటి నుంచి నేటికీ పాకం గార్లకు ఈ వూరు చాలా ప్రసిద్ధి.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఖండ్రిగ కోవా...


ప్రస్తుతానికి  ఇది  ఉభయగోదావరి జిల్లాల ఫేమస్ స్వీట్. ఊరు పేరునే కోవా పేరుగా మార్చేసుకుంది.కొత్త పేట మండల కేంద్రానికి కూతవేటు దూరంగా చిన్నగా ప్రారంభమైన వ్యాపారం నేడు ఉభయగోదావరి జిల్లాలకు పాకింది. 
--------------------------------------------------------------------------------------------------------------------------

తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామంలో తయారు చేసే నగరం గరాజీలు చాలా పేరు పొందినాయి.  ఈ గారాజీలే కాకుండా కాస్తాలు, నాన్ రొట్టి షేర్వా కూడా  ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

బియ్యం పిండి, పంచదారతో గరాజీలు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిస్తారు.. ఎందుకంటే నగరం గరాజీలకు అంత డిమాండ్ మరి..గ్రామంలో గరాజీల తయారీ ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది.సుమారు వంద కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు
--------------------------------------------------------------------------------------------------------------------------
పెనుగొండ కజ్జికాయలు..



పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో కజ్జికాయలు స్పెషల్. ఎవరు పెనుగొండ  వెళ్లినా ఈ కజ్జికాయలు రుచి చూడవసిందే. పాకం కారుతూ నోరు తీపి చేసే కజ్జికాయలంటే ఇష్టపడనివారుండరు. దేశ విదేశాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులకు ఈ పెనుగొండ కజ్జికాయలను పంపిస్తూవుంటారు .