ఆంధ్ర
ప్రదేశ్ లో ప్రవహిస్తున్న జీవనదులలో గోదావరి ఒకటి. దీని పుట్టుక స్ధానము మహారాష్ట్ర లోని నాసిక్ నకు దగ్గరగానున్న త్రయంబకం/త్రయంబకేశ్వర్.
ఇది అరేబియా సముద్రము నకు 80కి.మీ.ల దూరం లో, ముంబాయి నుండి 110 కి.మీ దూరంలో, సముద్రమట్టం నుండి 1067 మీటర్ల ఎత్తులో ఉన్నది. త్రయంబకము కొండలో చిన్నకొనేరుగా పుట్టి, అక్కడి గోముఖము ఆకారములో ఉన్న విగ్రహం నోటి నుండి సన్నని ధారగా బయటకు ప్రవహించి, 500 మి.మీ. వర్షపాతము నకు సమానమైన నీటిమట్టంగా తయారై, షిర్దిబాబా ఆలయం, నాందేడ్ కొండలు, అడవుల గుండా 770 కి.మీ ప్రయాణించి, ప్రవహించి, బాసర లోని సరస్వతి ఆలయము వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి బాసర, పోచంపాడు, మంచిర్యాల ల మీదుగా,పేరూరు , చర్ల , దుమ్ముగూడెం , భద్రాచలం , కూనవరం , పాపికొండలు దాటి, మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి లను ఉపనదులుగా తనలో కలుపుకొని, పొలవరం, పట్టిసీమ లను దాటుకొని, రాజమండ్రి వద్ద వెడల్పాటి నదిగా మారి, రాజమండ్రికి దిగువున ఉన్న ధవళేశ్వరము తరువాత తూర్పుగా, పశ్చిమముగా రెండు పాయలుగాచీలి, గోదావరి డెల్టాను మూడు భాగాలుగా చేసి, బంగాళా ఖాతము లో సంగమిస్తుంది. గోదావరి మొత్తం పొడవు 1465 కి.మీ. ధవళేశ్వరం వద్ద రెండుగా చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కి.మీ. ప్రవహించి, వృద్ధగౌతమి,కోరంగి అను రెండు భాగాలుగా చీలి సముద్రంలో కలుస్తుంది. అలాగే పశ్చిమ పాయను వశిష్ట అంటారు. ఇది దక్షిణంగా 40 కి.మీ. ప్రయాణించి, వైనతేయగా అటు అంతర్వేది, ఇటు యానాం తరువాత సముద్రంలో కలుస్తుంది. డెల్టా అనునది గ్రీకు అక్షరము. ఇది త్రిభుజాకరంలో, Δ రూపంలో, ఉంటుంది. పాయాలుగా చీలిన గోదావరి పరీవాహకప్రాంతము డెల్టా(Δ) ఆకారంలో ఉన్నందున, ఈ ప్రాంతానికి గోదావరి డెల్టా యని పేరు ఏర్పడినది.
ఆనకట్ట నిర్మాణానికి ముందు గోదావరి డెల్టా నేపథ్యము
గోదావరి నది పై ధవళేశ్వరము వద్ద ఆనకట్ట నిర్మించకముందు, గోదావరి డెల్టా లోని రెండు జిల్లాలు అతివృష్టి వలన, తుఫానుల వలన ముంపునకు గురై, అనావృష్టి వలన కరువుకాటకాలకు లోనై, ప్రజలు అష్టకష్టాలు పడుచు, దుర్భర దారిద్ర్యానికి లోనయి జీవించేవారు. వరుసగా దాదాపు 20 సంవత్సరములు క్షామం నీడలో రెండు జిల్లాల జనం అల్లాడిపోయారు.1831-32 లో అతివృష్టి మరియు తుఫానుల కారణంగా పలు గ్రామాలు ముంపుకు గురైనాయి. 1833 లో, నందన సంవత్సరంలో, అనావృష్టి వలన దుర్భరమైన క్షామం, కరువు వచ్చి, వేలసంఖ్యలో ఆకలి చావులు సంభవించాయి. దీనినే నందన క్షామము అన్నారు. దాదాపు రెండు లక్షలమంది కరువు బారిన పడ్డారు. ఊరు విడిచి వెళ్లలేని వారు కడకు తమ ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను సంతలో వస్తువులను అమ్మినట్లు అమ్ముటకు కూడా సిద్ధమయ్యారంటే, నాటి క్షామం ఎంత తీవ్రమైనదో ఊహించవచ్చును. తిరిగి 1839 లో తీవ్రమైన తుఫానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై, క్షామ పరిస్థితులేర్పడి, వేలాది జనం కాందిశీకులుగా ప్రక్క జిల్లాలకు, ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళవలసివచ్చింది.
ఆనకట్ట నిర్మాణము
గోదావరి జిల్లాల ప్రజల ఈ దుర్భర పరిస్థితులను గమనించిన, అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రి మౌంట్ , ప్రజల కష్టాలను వివరిస్తూ, ప్రభుత్వానికి ఒక నివేదికను పంపాడు. ఆ నివేదికకు స్పందించిన బ్రిటిషు ఇండియా ప్రభుత్వం, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకుగల అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనావేయుటకై ఆర్థర్
కాటన్ అనే ఇంజనీరుకు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశం పై రాజమండ్రి వచ్చిన కాటన్, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకై, అనువైన ప్రాంతానికై అన్వేషణ ప్రారంభించాడు. ఆనాడు గోదావరి తీరప్రాంతం వెంబడి వాహనాలు ప్రయాణించుటకు అనుకూలంకాదు. సరియైన బాటలు లేవు. కాటన్ ఈ గోదావరి తీరప్రాంతాన్ని గుర్రాన్ని తనవాహనంగా చేసుకొని, పర్యవేక్షించాడు. సరియైన ఆహారందొరకనప్పుడు అరటిపళ్లతోనే సరిపెట్టుకున్నాడు. గుర్రంపై స్వారీచేస్తూ, గోదావరి నది ప్రాంతాన్ని కూలంకషంగా పరీక్షించడం మొదలుపెట్టాడు. మొదట కోయిదా-జీడికుప్ప ప్రాంతాన్ని, మరియు పాపికొండలవద్దనున్న ప్రాంతాన్ని పరిశీలించాడు. పొపికొండలవద్ద గోదావరి సన్నబడి కేవలం 200మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆనకట్ట కట్టుటకుగల సాధ్యాసాధ్యాలను అంచనా వేసాక, పోలవరం దగ్గరనున్న మహానందికొండ-పొదలకొండ తీరప్రాంతాన్ని పరిశీలించాడు. ఆతరువాత పట్టిసీమను దర్శించాడు. చివరికి రాజమండ్రి ధవళేశ్వరం, విజ్జేశ్వరము మధ్య నదివెడల్పుగా ఉండటం, లంకలు, ఇసుకతిప్పలు ఉండటం వలన, ఆనకట్ట నిర్మాణ సమయంలో నదినీటిని ప్రక్కకు మళ్లించుటకు అనుకూలంగా ఉంటుందని భావించి, అచ్చటి పరిస్థితులను అధ్యయనము చేసి, ఆనకట్ట కట్టుటకు అనుకూలమైనదంటూ కాటన్ తన నివేదికను అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ ట్వేల్ డేల్ కు సమర్పించాడు. ఆయనకూడా దానిని ఆమోదించి, లండను లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు పంపించాడు. వారు ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి, డిసెంబరు 23వతేది, 1846 న తమ ఆమోదం తెలుపుతూ, అనుమతి పత్రముపై సంతకంచేసారు. వెంటనే ఆలస్యం చెయ్యకుండ, కాటన్ ఆధ్యర్యములో 1847 న ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
![]() |
Barrage when Construction |
నిర్మాణం వివరాలు
అర్ధర్ కాటను గోదావరిపై ఆనకట్ట నిర్మించుటకై ఎన్నుకున్న ప్రాంతములో నది వెడల్పు దాదాపు 6 కి.మీ. అందులో మూడోవంతు లంకలున్నాయి. నీటి మళ్ళింపుకై మొదట ఇసుకగట్లను కట్టారు. 1847నాటికి ఆనకట్టనిర్మాణానికై 10వేలమంది కూలీలను, 500 మంది వడ్రంగులను, 500మంది కమ్మరులను పనికై నియమించారు. కూలీలు పనిచేయు సమయంలో కాటను సతీమణి ఎలిజెబెత్, కూలీల పిల్లలకు పాఠాలు చెప్పేది. 1847 అగస్టు 3వ వారమునాటికి ఇనుము/ఉక్కు రాగానే, యంత్రసామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమైనాయి. ఆనకట్టకు అవసరమైన రాయిని రైలు వ్యాగనుల ద్వారా నదిఒడ్దుకు చేర్చేవారు. రైలువ్యాగనుల పట్టాలుగా, వంపులేని నిడుపాటి కర్రబాదులకు ఉక్కురేకులు తాపడంచేసి ఉపయోగించారు. నది ఒడ్డుకు చేర్చిన రాళ్లను పడలవలద్వారా నదిలోని నిర్మాణప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వాడారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీగర్భములో నిర్మాణస్థలానికి తీసుకెళ్లేవారు, ఈ పడవలద్వారా. ఇదే సమయంలో తగినంత ఇటుక తయారుకాగానే, ఆనకట్ట పునాదులు, నూతులు త్రవ్వుట వంటిపనులు చురుకుగా ప్రారంభించి, 1847 జూలై లో నదిలో నీరుచేరువరకు కొనసాగించారు. నదిలో నీరుచేరగానే పడవలలో రాళ్లను నదిలోని లంకలకు చేర్చి, గట్లను గట్టిపరచే పనులు మొదలుపెట్టారు. లంకలోని అన్నిగట్లను ఏకకాలంలోనే కట్టడం మొదలుపెట్టారు. తగినంత ఆర్థికసహాయం అందుబాటులోకి రాగానే,1849, ఫిబ్రవరి లో విజ్జేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు. ఒక్కొక్క వరుసలో 15 తూరలుగల అడుగు తలుపులు,మూడుడెల్టాలకు (తూర్పు, మధ్య, పశ్చిమడెల్టాలు) నీరు పంపుటకు ప్రధాన ద్వారములు,పెద్దకాలువ ప్రారంభమైనచోట ఒకలాకును నిర్మించారు. 1852 కు ఆనకట్టనిర్మాణం పూర్తయ్యింది.కాటన్ యొక్క అలుపెరగని అకుంఠిత దీక్షవలన,చిత్తశుద్ధిగా చేసిన కార్యం వలన ఆనకట్ట నిర్మాణం అతితక్కువ సమయంలోనే పూర్తయ్యింది.
సుఖాంతం కాదు
1860లో కాటన్ రిటైర్ అయ్యాడు. 1859లో జిల్లా పరిపాలనలో మార్పులు జరిగాయి. రాజమండ్రి జిల్లా కోస్తా గోదావరి జిల్లాగా మారింది. ఉభయగోదావరులింకా రాలేదు. 1857 సిపాయి తిరుగుబాటు సమయంలో విధ్వంసక చర్యలు జరుగుతాయని, ఆనకట్టలు పాడుచేస్తారని భావించారు. కాటన్ దక్షిణాదిలో బ్రిడ్జిలు, ఆనకట్టలు తనిఖీచేస్తూ ఉండేవాడు కాని దక్షిణాదిన సిపాయి తిరుగుబాటు ప్రభావం లేకుండాపోయింది. కాటన్ ఇంగ్లండు వెళ్ళిపోయాడు. కథ యింతటితో ముగియాల్సింది. అప్పుడు సుఖాంతంగా ఉండేది. అట్లా జరగలేదు.
కాటన్ మొదటినుండీ ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతడేశానికి రైళ్లకంటె కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని అతని ఉద్దేశం, అని పంటలకూ,ప్రయాణాలకూ పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. వారంతా ఇంగ్లండులో కాటన్ పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాల నివ్వలేదని, దండుగ మారివనీ, కనుక విచారణ జరగాలన్నారు. అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది.
ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలక్టు కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన యీ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి, కాటన్ ను పరీక్షించారు. సర్ జార్జి కాంప్ బెల్ వంటివారు కాటన్ వ్యతిరేకత బాగా చూపారు. ఐనా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికలలో జరిగిన వదోపవాదలకు; సెలక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్. కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక, ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమయింది. రైలుమార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలనూ కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపారు.
![]() |
Godavari Delta Pitamaha & Apara Bhageeradha Sir Cotton |
గోదావరి డెల్టా పితామహుడు
దేశీయుల ఆదరాభిమానాలకు మన్ననలకు కాటన్ పాత్రుడయ్యాడు,యివి కేవలం పొగడ్తలు కాదు. కాటన్ ఆచరణలో దేశీయులపై ఉంచిన నమ్మకం, వారిచే పనిచేయించుకున్న తీరు, పల్లకి ఎక్కిన ప్రభువువలెగాక, తానూ ఒక కూలీగా అందరితో కలసి కష్టించిన ఫలితంగా ఆయనకు ఆచరణ లభించింది. వి.వీరన్నవంటి ఓవర్సీర్లు కాటన్ కు లభించారు. వీరన్నతరువాత సబ్-ఇంజనీరుగా పైకివచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్ కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు. ఆనకట్టపై ఒకచోట అతని పేరిట ఫలకం ఉన్నది. 1867లో వీరన్న చనిపోయాడు.
1879-80లో కరువు విషయమై నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల అవశ్యకత, ప్రాధాన్యతను నొక్కిచెప్పి, కాటన్ వాదనను సమర్ధించాయి. వీటన్నిటి దృష్ట్యా నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు "గోదావరి డెల్టా పితామహు"డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు. రిటైర్ అయిన తరువాత 1863లో మరొక్కసారి కాటన్ ఇండియా వచ్చి వెళ్ళాడు.
1899 జులై
14న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరివాసులకు బంగారుపంటల్ని యిచ్చిన వ్యక్తిగా వరిత్రకెక్కాడు. ప్రజల దీనావస్థ కళ్ళారా చూచి, తెలుపు నలుపు అనే రంగు భేదం లేకుండా, మానవతాదృక్పధంతొ ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్. అందుకనే ఆయన నాటికీ,నేటికీ ఆదర్శప్రాయుడు. వృధాగా పోతున్న నీటిని ప్రవహించే బంగారంగా మార్చిన కాటన్ ముందుచూపు గమనార్హమైనది
కృతజ్ఞత
డెల్టావాసులకష్టాలు తీరాయి. అన్నమో రామచంద్రా అంటూ దేశాలు పట్టిపోయినవారు, దేశానికే అన్నదాతలైనారు. డెల్టాప్రజలకు కాటన్ అపరభగీరథుడయ్యాడు. డెల్టాప్రాంతాన్ని సస్యశ్యామలము చేసిన ఘనత అర్థర్ కాటన్ కే దక్కుతుంది. ఈ దేశం వాడు కాకపోయినను, తన పనిని చిత్తశుద్ధితోచేసి ఈ ప్రాంతవాసుల గుండెలలో శాశ్వతంగా కొలువైనాడు. డెల్టాప్రాంతంలో ఇంచుమించు అన్ని గ్రామాలలో ఇప్పటికీ కాటన్ యొక్క విగ్రహాలు దర్శనమిస్తాయి.

ప్రాతః స్మరణీయుడు
గోదావరి నీరు పెద్ద కాలువలు, పిల్ల కాలువలు, బోదెల ద్వారా పొలాలకు అందింది. తమ ఊరి దగ్గరకే వచ్చిన గోదావరి నీటిలో ప్రాతఃకాలమందే స్నానము చేసి, అనుష్ఠానములు తీర్చుకున్న పండితులు కూడా ప్రాతః స్మరామి సతతం కాటనుం తం భగీరథం అంటూ కాటను ను తమ ప్రాతఃస్మరణీయుల జాబితాలో చేర్చారు.
కొనసాగింపు
తరువాతకాలంలో, అదనంగా ఎక్కువపొలాలకు సేద్యపునీటిని అందించుటకై, పడవల ప్రయాణ అవసరాలకై 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు 2అడుగులు పెంచబడినది. అటుపిమ్మట 1897-99 లలో సిమెంటు కాంక్రీటు 9 అంగుళాలు పెంచారు. తిరిగి 1936 లో 3 అడుగుల తలుపులు(గేట్లు)అమర్చి 10లక్షల ఎకరాలకు సేద్యపునీరు అందిస్తున్నారు.
ధవళేశ్వరము ఆనకట్ట వివరాలు
ఆనకట్ట మధ్యలో లంకలు ఉండటం వలన ఆనకట్టను నాలుగు భాగాలుగా వర్గీకరించారు. ధవళేశ్వరము వైపు ఆనకట్టపొడవు 1440.5 మీ.ఉండి 70 గేట్లను కలిగి ఉన్నది. ఆ తరువాత ర్యాలి(ralli)విభాగం ఆనకట్టభాగం 884.45 మీ. పొడవు ఉండి, 43 గేట్లను, మద్దూరు విభాగం 469.6మీ.పొడవు ఉండి, 23గేట్లను కలిగి ఉండగా, విజ్జేశ్వరము ఆనకట్ట 804.9 మీ.పొడవు ఉండి, 39 గేట్లను కలిగి ఉన్నది. ఈ ఆనకట్టల నిర్మాణం 3599 మీ. ఉండగా, లంకలతో కలుపుకొని ఆనకట్టమొత్తము పొడవు 5837మీటర్లు, మొత్తంగేట్లసంఖ్య 175, ఒక్కోగేటు పరిమాణము19.29X3.35మీటర్లు, ఒకగేటు బరువు 27టన్నులు. ఈ ఆనకట్ట క్రింద తూర్పుడెల్టాకాలువ క్రింద 2.76 లక్షల ఎకరాలు, మధ్యడెల్టాకాలువ క్రింద 2.04 లక్షల ఎకరాలు, పశ్చిమడెల్టాకాలువ క్రింద 5.20 లక్షల ఎకరాలు సాగులో ఉంది.1980 లో ఆనకట్టకు మరమత్తులు చేసి, ఆనకట్ట ను పటిష్ట పరచారు. ధవళేశ్వరము ఆనకట్టను చేర్చి 1980 లో బస్సురోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు మీదుగా చిన్నవాహనాలు(కార్లు, మోటారు సైకిళ్లు)విజ్జేశ్వరం మీదుగా వెళ్ళు ఆర్.టి.సి.బస్సులు ప్రయాణించును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి