28, ఏప్రిల్ 2016, గురువారం

Kotipalli (కోటిపల్లి)

కోటిపల్లి


Kotipalli Someswara Swamy Temple



కోటిపల్లి, తూర్పు గోదావరి జిల్లాకి  చెందిన గ్రామము. ఇది కాకినాడ కు 38 కి.మీ.లు, రాజమండ్రి కి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో, Razole (రాజోలు) నుండి 35 కి.మీ. దూరంలో ఉంది,  కోటిపల్లి పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.


కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు,శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు.  ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణం లో చెప్పబడిఉంది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన  పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్టించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.


ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి ఉత్తరపు ఒడ్డున ఉన్నది. గోదావరి ని ఈ క్షేత్రం వైపు  ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యం లో  ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గొదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని. ఈ క్షేత్రం లో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.


ఈ ఆలయ ప్రాంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం మరియు భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి.

ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు మరియు కొలను కలవు. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు  అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు వుంది.ఈ దేవాలయము లో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.  శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణం లో కోటి దీపాలు వెలిగిస్తారు.ద్రాక్షారామం చుట్టూ వున్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి.


ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం  యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.


అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ,  పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని  పిలిచేవారు. ఇక్కడ సోమం కుండం అనే ఒక పెద్ద పుష్కరిణి నేటి కీ ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు.


ఆలయం లో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మడపం లో కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయం లోనే చంద్రమౌళిశ్వర స్వామి శంకరాచార్యుల  మందిరం, ఉమా సమేత మృత్యంజయ లింగం , నవగ్రహాల గుడి ఉన్నాయి.



Limgam of Kotipalli Someswara Swamy

25, ఏప్రిల్ 2016, సోమవారం

కొపనాతి కృష్ణమ్మ గారు

కొపనాతి కృష్ణమ్మ



అంతర్వేది" శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము నిర్మింపజేసినది, గొప్ప భగవద్భక్తుడని కీర్తివహించిన పుణ్యమూర్తి "శ్రీ కొపనాతి కృష్ణమ్మ"గారు. కృష్ణమ్మగారి జన్మస్థలము తూర్పుగోదావరి జిల్లా, అల్లవరం మండలం బెండమూర్లంక శివారు "ఓడలరేవు" గ్రామము. ఇది వైనతేయ గోదావరి సాగరసంగమ పుణ్య స్థలము. వీరు  అగ్నికులక్షత్రియులు.

దూరప్రదేశమునుండి అంతర్వేది క్షేత్రమును దర్శింపవచ్చిన బ్రాహ్మణోత్తముడు ఒకరు స్వామివారిని దర్శించి జీర్ణాలయమును గాంచి, అనుభవజ్ఞులద్వారా ఆ వృత్తాంతమును తెలిసికొని ఈ ప్రదేశము గొప్ప దివ్యక్షేత్రముగా వెలయగలదని భావించి స్వామివారికి ఆలయమంటపాదులు ఏర్పరచగల సమర్థుడు, భక్తవర్యుడు, త్యాగపురుషుడు ఎవరాయని గ్రామగ్రామములు తిరుగుచుండెను. ఎవ్వరును బ్రాహ్మణుని మాటలు వినిపించుకొనలేదు.

వైనతేయసాగరసంగమ పుణ్యస్థలము, నౌకావ్యాపారానికి కేంద్రమై ఓడలరేవుగా సార్థకనామమునందిన గ్రామసీమ. బెండమూర్లంక దీని సమీపగ్రామము. అగ్నికులక్షత్రియులు ఓడల వ్యాపారము చేయుచు లక్ష్మీసంపన్నులై ఉన్న రోజులవి. ఇందు కొపనాతివారు గొప్ప ఉదారులైన భక్తవర్యులని పేరుపొందిరి.

బ్రాహ్మణోత్తముడు ఓడలరేవు గ్రామము విచ్చేసి భక్తవర్యులైన కొపనాతి ఆదినారాయణగారిని దర్శించుకొనిరి. బ్రాహ్మణుని బహువిధముల సత్కరించి ఆదినారాయణగారు విషయమును తెలిసికొని నిస్పృహ చెంది అంతటి ఆలయనిర్మాణము తమవలన కాదని సమాధానము చెప్పి పంపివేసిరి.

నాటిరాత్రి ఆదినారాయణగారికి నల్లనిరూపువాడు, నామాలు ధరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కలలో కనిపించి "భక్తా! నీవు అసమర్థుడవు కావు. ఆలయనిర్మాణమునకు పూనుకొనుము. అశ్రద్ధ చూపుచున్నావేమి? లెమ్ము" అని వీపుపై చేతితో ఒక్క చరుపు చరిచి అదృశ్యులైరి. ఆదినారాయణగారు తుళ్ళిపడి లేచి చూచుకొనగా తమ వీపుపై ఐదువేళ్ళు ఆనవాళ్ళు కనిపించగా ఆశ్చర్యపడి అపచారమును మన్నించమని కోరుకొని ఆలయనిర్మాణ కార్యక్రమము చేపట్టుదునని సంకల్పించుకొనిరి.

భగవానుని ఆదేశానుసారము అంతర్వేది వెళ్ళి ఆదినారాయణగారు ఒక సుముహూర్తమున ఆలయ శంకుస్థాపన గావించిరి. “ఇసుక తప్ప ఏ రాయియు దొరకని ఈ దూరసముద్ర ప్రాంతమునకు మహా ఆలయ నిర్మాణమునకు కావలసిన శిలాస్తంభములును, రాళ్లనుగొనిరాబడుట గొప్పవి.

పరమభక్తులగు శ్రీ కొపనాతి ఆదినారాయణగారు శ్రీలక్ష్మీనృసింహ స్వామివారి ఆలయ బేడామంటపాదులను నిర్మించుట మొదలుపెట్టి నల్లరాళ్ళు తెప్పించి దేవాలయము చుట్టు, కోవెలలయొక్కయు, బేడామంటపము యొక్కయు పని ప్రారంభించి కొంత పనియైన పిమ్మట 'కాలోయందురతిక్రమః' అన్నట్లు కాలమాసన్నమైనందున తమ కుమారులకు ఆ దేవాలయ నిర్మాణమును పూర్తిచేయ నియోగించి తాము విష్ణుసాయుజ్యము పొందెను.

ఆదినారాయణ, మహాలక్ష్మీ దంపతుల పుణ్యఫలంబుగా అవతరించిన కృష్ణమ్మగారు భక్తవరేణుల్యైయుండిరి. ఈయన చిన్ననాటినుండే భక్తిభావమును గ్రహించెను. అతిథి అభ్యాగతులను పూజించెడివారు. బ్రహ్మజ్ఞానుల బోధనలు విని అందలి అంతరార్థమును గ్రహించెడివారు.

చిన్నతనమున ఒకరోజు స్నేహితులతో కలిసి స్వగ్రామమగు ఓడలరేవునందలి సముద్రతీరమునకు వెడలి రేవుకు చేరుచున్న ఓడలను గమనించుచుండిరి. ఆ సమయమున ఒక క్రొత్తవ్యక్తి కృష్ణమ్మగారిని పిలువగా ఆయన ఆ వ్యక్తిని అనుసరించెను. చెట్లమధ్యకు తీసికొని వెళ్ళి ఆ వ్యక్తి జీవితలక్ష్యమును బోధించి తారకనామమును ఉపదేశించి అదృశ్యుడయ్యెను. కృష్ణమ్మగారిని వెదుకుకొనుచు వచ్చిన స్నేహితులు కృష్ణమ్మగారు ఏమైనారా అని దిగులుచెందిరి. ఉపదేశము పొందిన కృష్ణమ్మగారు కొంతసేపటికి ఇల్లు చేరుకొనిరి. మరునాటినుండి కృష్ణమ్మగారు స్నేహితులను

జీవితపరమార్థములను గూర్చి బోధించుచుండిరి. కృష్ణమ్మగారి కుటుంబసభ్యులు ఐకమత్యముతో లరారుచుండిరి. వీరి అగ్రజులు ఓడలపై సబురు చేయుచుండిరి. గొప్ప సిరిసంపదలతో తులతూగుచుండిరి. అవసానకాలమున ఆదినారాయణగారు ఆదేశించిన ప్రకారము అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయ నిర్మాణము కొనసాగించుటకు పూనుకొంటిరి. వీరి సోదరులైన రంగనాయకులు గారు వీరికి చేదోడువాదోడుగా ఉండి ఆలయనిర్మాణమునకు అధిక ప్రోత్సాహమొసంగిరి.

ఒకప్పుడు కోస్తారేవులకు వెళ్ళిన ఓడలు ఎంతకాలమునకు తిరిగిరావయ్యె. వాటి వర్తమానము ఏమి తెలియదయ్యెను. ఓడలు రేవుకు చేరగలను ఆశ సన్నగిల్లెను. ఈ సమయంలో కృష్ణమ్మగారు ఒకనాటి రాత్రి ఇట్లు ధ్యానింపజొచ్చిరి. “తండ్రీ! పరాత్పరా! నీ దేవళము తలపెట్టి యింతకాలమైనది. ఇంకను పూర్తిచేయలేకుంటిని. ఈయెడ ఇల్లు జేరిన వెంటనే ఎటులనో నీ కార్యము కొనసాగింప నిశ్చయించుకొంటినే. నా మనసునిరాశనొందుచున్నది. ఏమి చేయుదును? ఇంతవరకు ఓడ దరిచేరలేదు. మరియొక చోట ఉన్నట్లు వార్తయైనను లేదు. ఇంకేమియాశ, దానికిని కాలమాసన్నమైనట్లున్నది. ఏమి చేయుదును? నా ప్రాణతుల్యమగు ఈ మహత్కార్యము కొనసాగించుట ఎటుల? నీవే నీ కార్యమును కొనసాగింపనిది నీ పాదరజముకైన సాటిరాని ఈ దీనుడేమి చేయగలడు? ఇంకను జూచెదగాక!” యని ధ్యానించి ధ్యానించి బడలికచెంది నిదురించెను.

ఆరాత్రి ఓడలు రేవుకు చేరినట్లును కప్తాను ధనపుసంచులతోవచ్చి తనను లేపినట్లును అనుభవమయ్యెను. కృష్ణమ్మగారు లేచి బైటకు వచ్చి నిలబడియుండిరి. నిజముగా కప్తాను ఓడలు రేవుకు చేరిన సమాచారము అందజేసి, ఆనందసాగరమున నోలలాడించెను. “నాయనా! మీ రాకను భగవానుడు ముందుగానే నా కెరింగించెను. తెచ్చిన ధనము నెల్ల గదిలో వేసి తాళము వేయుము. ఆ ధనమంతా స్వామివారికి ధారపోసితిని. అందు కాసైనను ముట్టవీలులేదు" అని కప్తానును ఆదేశించి కృష్ణమ్మగారు ఆ విధముగనే ధనమును వినియోగించిరి. ఆగిపోయిన ఆలయనిర్మాణమును పునఃప్రారంభించి ఓడలరేవునుండి కావుళ్ళతో ధనమును రప్పించి కార్యక్రమములను కొనసాగించిరి.


ఆలయ నిర్మాణము

కృష్ణమ్మగారు కొంత ద్రవ్యము చేబూని కొన్ని వందల పడవలను తీసికొని రాజమండ్రి చేరి అందున్న రాళ్ళన్నియు పడవలపై ఎగుమతి చేయించి అంతర్వేది రేవునకు చేర్చమని చెప్పి ఇంటికి మరలివచ్చెను. ఎగుమతి పూర్తయిన తరువాత ధవళేశ్వరముననొక దొరవారు ఆ పడవలను ఆపుచేయించి పడవ నడుపు పనివారను చెల్లాచెదురుగా పారద్రోలించెను. అంతనారాత్రి నరసింహదేవుడు పట్టివర్థనములు దరించి వెండిబెత్తము చేబూని దొరవారి స్వప్నమునగాన్పించి బెత్తముచే వీపుపై తట్టి లేపి నా పడవలను ఏల ఆపుజేసియుంటివి? నేనెవ్వరననుకొంటివి? అని తన వృత్తాంతమునంతయు అతనికి చెప్పి అదృశ్యుడయ్యెను. తక్షణమే పడవలన్నియు నరసింహదేవుని మహత్తుచే తెల్లవారు సరికి అంతర్వేది రేవునకు జేరియుండెను. ఈ విషయము దొరవారు తెలిసికొని నరసింహదేవునకు నమస్కరించి అపరాధమును క్షమింపుమని ప్రార్థించి ఆ దేవదేవుని మహత్తునంతయు సర్వజనులకు విశదమొనర్చెను.

ఆలయనిర్మాణము నిమిత్తము రంగనాయకులుగారు అంతర్వేదిలో ఉండి పనులను చక్కబెట్టుచుండిరి. కృష్ణమ్మగారు ఎప్పటికప్పుడు ఓడలరేవునుండి పల్లకీపై అంతర్వేది వచ్చి పనులను పురమాయించి తిరిగి స్వగ్రామమునకు చేరుచుండిరి. అప్పటి దినభత్యము కూలీలకు రెండణాలు (12పైసలు) ఇచ్చుచుండిరి. దేవాలయ జమాఖర్చులను వ్రాయుచున్న కరణమును కనుగొని కృష్ణమ్మగారిట్లు మందలించిరి. “నీవు లెక్కలుకట్టిన మనము పనులు చేయజాలము. ఈ సంపాదన నాదని నీవు భావించుచుంటివా! ఇదియంతయు దేవుడే సంపాదించుకొనినాడు.  దేవునిసొమ్ముతో చేయు దేవకార్యమునకు జమాఖర్చులా? ఇప్పటినుండి ఆపుచేయుము” అని ఆదేశించిరి.

పేరుపొందిన శిల్పులను దూరప్రదేశములనుండి రప్పించి ఓడలపై శిలలను తెప్పించి ఉత్సాహముతో పనులను సాగించుచుండెను. ఓడలరేవునుండి కావుళ్ళతో ధనమును మోయించుకొని వచ్చి లెక్కలేకుండా వెచ్చించుచుండెను.

పని ముమ్మరముగా సాగుచున్న సమయమున ఒక పనివానిపై రాయి పడి మరణించెను. ఈ సంగతి కృష్ణమ్మగారికి చెప్పగా ఆయన ఆ ప్రదేశమునకు వచ్చి పడియున్న పనివానిని పరిశీలించి పనిచేయుచున్న వారితో ఇట్లనిరి, “మీరందరు పనిని కట్టిబెట్టుడు స్వామి కార్యము చేయుచున్న ఈ భక్తుడు బ్రతికినగాని నిర్మాణము చేయవలదు” అని పనిఆపుజేయించి స్థిరసంకల్పముతో అచ్చటనే కూర్చొని ఉపవాసముతో దైవధ్యానపరాయణులై ప్రాయోపవేశమునకు గడింగిరి. భగవానుని లీలలు అత్యద్భుతముకదా! నిద్రనుండి మేల్కొంచినవానివలె ఆ పనివాడు లేచికూర్చుండెను.

అచ్చటివారు ఈ అద్భుతమునకు మిక్కిలి సంతసించిరి. కాని కృష్ణమ్మగారు ఇది శ్రీలక్ష్మీనృసింహస్వామివారి మాహాత్మ్యమేకాని తమ ప్రభావము కాదని ప్రేక్షకులను హెచ్చరించిరి.

గర్భాలయము దానిజేరి బలమైన మంటపములు కుడిప్రకక్కను రామాలయము, ఎడమవైపున కల్యాణమండపము, దీనికి చుట్టును నాల్గువైపుల మంటపములు, గోపురములు, చుట్టును రాజలక్ష్మీ తాయారు, వేంకటేశ్వరస్వామి, భూదేవితాయారు, శ్రీరంగనాయక స్వామి, సంతానగోపాలస్వామి, కేశవస్వామి, పన్నిద్దరాళ్యావరులు, ఆంజనేయస్వామి, శ్రీరాములవారు, గోపాలస్వామి  వార్ల పది ఆలయములును (వీరిని సన్నిధి దేవతలందురు). మంటపములమీద విమానములు కొన్ని గుండ్రముగాను, కొన్ని కూచిగాను చెక్కబడినవి. ఇట్టి అత్యద్భుత నిర్మాణములను కావించి యే స్థానమున ఏ నిర్మాణము కావలయునో అట్టి కట్టడములను నిర్మించి తీర్చిదిద్దిరి.

దైవకార్యకలాపములు సాగించుచుండగా కృష్ణమ్మగారికి అనేక అవాంతరములు కలిగెను. అన్ని కార్యములలోను సహకారిగానున్న సోదరులు రంగనాథుడు స్వర్గస్థుడయ్యెను. గోరుచుట్టపై  రోకటిపోటు అన్నట్లు కృష్ణమ్మగారి సతీమణి కూడ దివంగతురాలయ్యెను. వాటినన్నిటిని ఓర్పుతో భరించి, స్వామివారు తమను పరీక్షించుచున్నట్లు భావించి ఆలయ నిర్మాణమును కొనసాగించుచుండిరి.

అంతర్వేది యాత్రకై వచ్చిన బ్రాహ్మణోత్తముడు ఆలయములను పరిశీలించి నిర్మాణములో ఏదో ఒక వాస్తు లోపముగలదనియు దానిని తీర్చుటకు మంగళగిరి పండితుడు తప్ప ఎవ్వరును  పనిచేయరనియు కృష్ణమ్మగారితో చెప్పి వెడలిపోయెను. కృష్ణమ్మగారు వెంటనే అంతర్వేదినుండి బయలుదేరి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మంగళగిరి చేరెను. కాని ఆస్థాప్రవేశము వీలుకాలేదు.  ప్రహరీగోడ ప్రక్కన అంగవస్త్రముతో అహోరాత్రములు పడియుండవలసివచ్చెను. నాటిరాత్రి మంగళగిరి రాజావారి కలలో స్వామివారు కనిపించి ఒక్క దెబ్బకొట్టి తన భక్తునకు అపరాధము జరుగుచున్నదని హెచ్చరించెను. వెంటనే ఆందోళన పడి లేచి చూడగా రాజావారి వీపుపై దద్దురులు చూచుకొని ఆశ్చర్యపడి పరివారమును పిలిచి విషయమేమని యడుగగా, ద్వారపాలకులు  "ఎవరో తమ దర్శనమునకు వచ్చి గోడప్రక్కనే వేచియున్నార”ని తెలియచెప్పిరి. పల్లకి పంపించి కృష్ణమ్మగారిని లోనికి రప్పించి ఉచితాసనము ఇచ్చి విషయమునడిగిరి. రాజావారు తమ ఆస్థాన పండితుని దూరప్రదేశమైన అంతర్వేది పంపుటకిష్టపడరైరి. కృష్ణమ్మగారు ఆ పండితునకు సంబంధించిన సమస్త రక్షణ పోషణాదులకు తాము స్వయముగా బాధ్యత వహింతుమని లిఖితపూర్వకముగా వ్రాసియిచ్చి ఒప్పించి పండితుని తీసికొనివచ్చిరి.

మంగళగిరి పండితుడు ఆలయనిర్మాణమును పరిశీలించి స్తంభఖాతశూల వచ్చినదనియు, దానిని శాంతిజేయుటకు ధ్వజస్తంభము ప్రక్క మరియొక ద్వజస్తంభమునెత్తించి సరిజేసెను. అంతటితో ఆలయ కార్యక్రమములు పూర్తి అయ్యెను.

భార్య లేనివారు ఆలయ ప్రతిష్ఠ కావించుటకు అనర్హులు కావున కృష్ణమ్మగారు వివాహము చేసికొని వైవాహిక కంకణమును, ఆలయ ప్రతిష్ఠ సంప్రోక్షణాదులు నిర్వహించుటకు సంప్రోక్షణ కంకణమును, ఉదారశీలురై దానకంకణమును వహించి- త్రికంకణధారులై ఒక సుముహూర్తమున శ్రీ లక్ష్మీనృసింహ స్వాములవారి ప్రతిష్ఠ గావించిరి.

21, ఏప్రిల్ 2016, గురువారం

కేశ సౌందర్యానికి కొబ్బరి నూనె




మన భారతదేశంలో అనాదిగా కొబ్బరినూనెను వాడటం వస్తోంది. మన పూర్వీకులు సైతం కేశ సౌందర్యానికి కానీ అలాగే తల పరిరక్షణకు గానీ దీనినే సూచించేవారు. అంటే కొబ్బరినూనెలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇక దీని వాడకం వల్ల కేశాలకు ఒత్తుదనం, అలాగే మృదుత్వం ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన విసేషాలున్నాయ్. ఇక కొబ్బరినూనె విశేషాలను చూడాలంటే ఇక చదవండి..

సహజసిధ్ధ కండీషనర్

ఇది ఒక సహజసిధ్ధ కండీషనర్. మీ జుట్టు పొడిబారినా, బలహీనంగా ఉన్నా ఈ నూనె బాగా జుట్టును మారుస్తుంది. కొన్ని పరిశోధనల ఆధారంగా ఈ నూనె మంచి కండీషనర్ మాత్రమే కాదు అస్సలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని నూనె అని తేల్చారు.

 కొబ్బరినూనె వల్ల జుట్టు సున్నితంగా, మృదువుగా మారుతుంది. అంతేకాక మాడు నుందీ అంటే స్కాల్ప్ లోపలి వరకూ చేరి కేశాలకు శక్తినిస్తుంది. జుట్టు పదే పదే దువ్వటం వల్ల ఊడిపోయే సమస్యను తీరుస్తుంది. టవల్ తో రుద్దటం వల్ల ఏర్పడే జుట్టు బలహీనపడినప్పుడు ఇది వాటికి శక్తి నిస్తుంది. ఊడకుండా కేశాలకు కుదుళ్ళకు పట్టునిచేలా చేస్తుంది. జుట్టుకు నూతన మెరుపునిస్తుంది.


జుట్టు పెరుగుదలను పెంచటం


కొబ్బరినూనె జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. వెంట్రుకలు ఊడిపోవటం, వెంట్రుకలు చీలిపోవటం, బలహీనపడటాన్ని నిరోధిస్తుంది. ఇది జుట్టుకు సున్నితత్వం, మరలా పెరిగే శక్తినివ్వటం, ఊడటాన్ని ఆపుతుంది. వెంట్రుకలలొ శక్తిని  నింపి తల లోపల అంటే కుదుళ్ళలో మరలా బలాన్ని నింపుతుంది.

చుండ్రు పోయేలా చేయటం


కొబ్బరి నూనె రారటం వల్ల చుండ్రును నివారిస్తుంది. సాధారణంగా కేశాలు పొడిబారి అదేవిధంగా కుద్దుళ్ళలో మట్టి చెమట చేరి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. కొబ్బరి నూనె జుట్టులో తేమను నింపి చుండ్రును పోయేలా చేస్తుంది.

మీరు కనుక చుండ్రుతో ఇబ్బంది పడుతోంటే ఖచ్చితంగా మీరు రోజూ రాత్రిళ్ళు కొబ్బరి నూనెతో మస్సాజ్ చేసుకుని పొద్దున్నే తలస్నానం చేస్తే మంచి పలితముంటుంది. చుండ్రు త్వరగా పోతుంది.

తలలోని అంటువ్యాధుల్ని అరికట్టడం

ఇది కేవలం ఒక్ మంచి కండీషనర్ మాత్రమే కాదు. మంచి ఔషధంల కూడా పని చేస్తుంది. తలలోని అంటువ్యాధుల్ని అరికడుతుంది. చుండ్రును పోగొట్టటం, తలలో వచ్చే కురుపులు లేదా పొక్కులు అలాగే రాషెస్ ను త్వరితగతిన పోగొడుతుంది.

జుట్టు చిక్కు సమస్యకు

జుట్టు చిక్కు సమస్య ఉంటే కొబ్బరినూనె చాలా మంచిది. మీకు గనుక పొడవాటి జుట్టు ఉంటే మీరు కొబ్బరి నూనే వాడటం మంచిది అంతేకాక పొడవాటి జుట్టు ఉన్నవారికి అనుక్షణం చిక్కు సమస్య వేధిస్తుంటుంది. ఆ సమస్యను అధిగమించాలంటే కొబ్బరి నూనె వాడితే సరి. జుట్టుకు రసాయన నూనెలు వాడటం వల్ల సమస్యలు వస్తాయి.  కావాలంటే మీరు మీ చిక్కు పడిన జుట్టు దగ్గర ఒక్క కొబ్బరి నూనె చుక్క వేసి చూడండి. వేసిన వెంటనే జుట్టు పై అది జారి వెంటనే చిక్కు పోయి సరిగ్గా వచ్చేస్తుంది. ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా చేస్తుంది.

సహజసిధ్ధ సన్ స్క్రీన్

కొబ్బరినూనె సహజసిధ్ధ సన్ స్క్రీన్ లోషన్ గ ఎంతొ బాగ పని చేస్తుంది. సాధారణంగా సూర్యుని లోని అతి నీలాలోహిత కిరణాలు అంటే అల్ట్రా వైలెట్ రేస్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి చర్మాన్నే కాదు వెంట్రుకలపై ప్రభావం చూపి నిర్జీవం చేస్తాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళలనుకున్నప్పుడు కొబ్బరి నూనె తీసుకుని అలాగే దానికి రోస్ వాటర్ కలిపి రాసుకుని వెల్టే జుట్టు ఎంతో సహజంగా అలాగే ఆరోగ్యంగా ఉంటుంది .ఎందుకంటే మార్కెట్లో దొరికే రసాయన
క్రీముల కంటే ఇదే ఉత్తమం. ఎంచేతంటే అవి భవిష్యత్ లో తీవ్ర సమస్యలను తెస్తాయి.

18, ఏప్రిల్ 2016, సోమవారం

రేమెళ్ళ అవధానులు - సంస్కృత మిత్ర

Dr. Remella Avadhanulu


డాక్టర్ రేమెళ్ళ అవధానులు సెప్టెంబర్ 25, 1948 తేదీన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని Razole (రాజోలు) సమీప గ్రామమైన పొడగట్లపల్లి లో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు. 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ చేసాడు. Razole (రాజోలు) డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో హైదరాబాదు లో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాదు వచ్చేశాడు. ఇ.సి.ఐ.ఎల్ భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, ఎ ప్లస్ బి హోల్ స్కేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్. లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులు కు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించాడు.

కంప్యూటరు లోకి తెలుగు

1976 నాటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరు లో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 1976 లో భారత దేశంలో కంప్యూటరు లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో కంప్యూటరు లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరు లోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమ పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడ కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.

నిమ్స్ కంప్యూటరీకరణ
అవధానులు కు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు కాకర్ల సుబ్బారావు తో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి,అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశాడు.

వేదాల కంప్యూటరీకరణ
NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్థించింది అవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి ఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడ అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థ మయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే.... కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్ర లో ఒకాయన ఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టాడు.

అఖిలభారత వేద సమ్మేళనంలో
అదే సమయానికి తి.తి.దే. వారు తిరుపతిలో అఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారతదేశ అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా తి.తి.దే. వారు కోరగా 'నమకం' లోని మూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ  'సీ లాంగ్వేజి ' సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మ చాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవధానికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్థోమత అవధానులకు లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు ఆ విషయాన్ని 'అశ్విని హెయిర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుకు తెలుపగా,... సుబ్బారావు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునాతన కంప్యూటర్ కొన్నాడు అవధాని. కంప్యూటరు మీద పని చేస్తున్న వారికి జీత భత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయాడు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్టు ను ప్రారంభించాడు. చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో అందరితో కలిసి తాను కూడ రాత్రుళ్ళు పనిచేసేవాడు.

యజుర్వేద అనుక్రమణికలు
ఆ సందర్భంలో వేదాలలో సైన్సు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలన్నీ కనబడ్డాయి అవధానికి. ఆ స్పూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు చూపించాడు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించాడు; ప్రశంసించాడు. ఆ విధంగా  అవధాని చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు. అందుకు అవధాని ఒక్కనితో అది సాధ్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటాడు అవదాని. ఆవిధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతాము.

ఇతర రంగాలలో సేవలు
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నాడు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మీమాంస ' శాస్త్రం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం చేశాడు. అదే విధంగా వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిషం అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశాడు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, సంస్కృత మిత్ర బిరుదుతో సత్కరించింది.

12, ఏప్రిల్ 2016, మంగళవారం

అల్లు రామలింగయ్య -- సినిమా హాస్యనటుడు - స్వాతంత్ర్య సమర యోధుడు



అల్లు రామలింగయ్య  (అక్టోబర్ 1, 1922 - జూలై 31, 2004) పేరులోనే హాస్యం ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య .

బాల్యము
Razole (రాజోలు) సమీప గ్రామమైన పాలకొల్లులో (పశ్చిమ గోదావరి జిల్లా ), 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.

అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.

చలనచిత్ర జీవితం అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది. పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్య సేవలందించేవాడు.

ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గుసినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.

అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.

పురస్కారాలు, సన్మానాలు

యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, , అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.

2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కోడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడుచిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవుడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితం లో సంతృప్తినిచ్చిన అంశాలు. 

అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.





8, ఏప్రిల్ 2016, శుక్రవారం

Pancharmaalu (పంచారామాలు)

ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.
పంచారామాల పుట్టుక
శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది. క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ట చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.
తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.
ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతొంది.
1.    అమరారామము, 2. దక్షారామము, 3. సోమారామము (భీమవరము), 4. కుమారారామము లేదా భీమారామము (సామర్లకోట), 5. క్షీరారామము (పాలకొల్లు) అనునవి పంచారామములు


అమరారామము
గుంటూరు జిల్లాలో గుంటూరు కు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.


దక్షారామము 
తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉందిఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడునాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి.


సోమారామము
పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామిఈ క్షేత్రం 
Razole (రాజోలు) నుండి 40 కి.మీ దూరంలో వున్నది.

కుమారభీమారామము
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపం లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల   మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.
కుమరారామ శ్రీ భీమేశ్వరస్వామి వేంచెసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం (అక్షాంశము 17 02' ఉ, రేఖాంశము 82 12' తూ). ఇది పూర్వం ఛాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేస్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది.

క్షీరారామము
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షేత్రం ఉన్నది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయిఈ క్షేత్రం Razole (రాజోలు) నుండి 22 కి.మీ దూరంలో వున్నది.