8, ఆగస్టు 2016, సోమవారం

Traditional Uppada handcrafted sarees

 ఆడవారి  అందానికే మరింత అందం తీసుకువచ్చేది చీర. అందుకే భారతీయస్త్రీలు... అందులో తెలుగుమహిళలకు చీర అంటే మహా ఇష్టం. పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో ఉప్పాడ జమ్‌దానీ పట్టుచీరలు ధరించటమంటే మగువలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఉప్పాడ చీరల తయారీలో నేత కార్మికుల నైపుణ్యం అణువణువునా కనిపిస్తుంది.


Uppada
saree
ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము. ఈ వూరు కాకినాడ వాకలపూడి లైట్ హౌస్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో వుంది, పిఠాపురం నుంచి కూడా ఈ వూరు చేరవచ్చు.  జరీ   తోచేయబడిన "జామదాని" చీరల నేతకు ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. వీటిని "ఉప్పాడ చీరలు" అని కూడా అంటారు. చేనేత వస్త్రాల తయారీలో ఈ ఉప్పాడ గ్రామానికి మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జమ్‌దానీ  చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని  చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జమ్‌దానీ చీరలకు ఉప్పాడ కేరాఫ్ అడ్రసు గా మారింది.  చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం.. 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశస్థాయిలో ప్రాచుర్యం పొందింది.

జమ్‌దానీ అనేది బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప చేనేత కళ. "జమ్‌దానీ"  అనే పదం పర్షియన్ భాషలోనిది. ఆ భాషలో "జమ్" అంటే పువ్వు అని అర్థం.  జమ్‌దానీ సంప్రదాయ నేత కళను యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించింది.

ఇంత ప్రాచుర్యం ఉన్న ఉప్పాడ చీరల వెనుక చేనేత కార్మికుల కఠోర శ్రమ అంతా ఇంతా కాదు. మగ్గంపై నిర్విరామంగా 10 గంటలు పనిచేస్తే అరమీటరు చీర ఉత్పత్తి చేయగలుగుతారు . జమ్‌దానీ చీర తయారీకి 10 రోజుల నుండి రెండు నెలల వరకు పడుతుంది. ఈ చీర తయారీకి ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు రోజుకు 10 గంటలు నిర్విరామంగా శ్రమిస్తారు. ఈ చీరను నేసేందుకు డిజైన్‌ వేసుకోవడం.. సిల్క్‌ దారాలు అల్లడం.. మగ్గంపై నేయడం వంటి పనులకు  చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తారు.

ఈ చీరల తయారీలో స్వచ్చమైన జరీతో పాటు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సన్నటి పట్టును వినియోగిస్తారు. అన్ని పట్టువస్త్రాల మాదిరిగా కాకుండా ఈ చీరపై ఉన్న డిజైన్‌ చీరకు ఇరువైపులా ఒకేలా ఉండడం దీని విశిష్టత. అంతేగాక కంచి, ధర్మవరం పట్టుచీరల కంటే ఈ ఉప్పాడ జమ్‌దానీ చీరలు బరువు తక్కువగా ఉంటాయి .




3, ఆగస్టు 2016, బుధవారం

Rajahmundry Gangaraju Palakova


రాజమండ్రి నగరంలోని ....టి.నగర్ ... ఆ వీధిలోకి అడుగు పెట్టగానే కమ్మటి వాసనలు....మనల్ని సాదరంగా ఆహ్వానిస్తాయి. మనప్రమేయం లేకుండానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల "గంగరాజు డైరీ" . 

పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి  పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు.

విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. గంగరాజు గారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరుకూడా గంగరాజు గారితోపాటు  రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. 

అమ్మకానికి  పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు.  రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్ లో  మొదటగా పాల వ్యాపారం మొదలు పెట్టారు గంగరాజు.  గంగరాజు గారి తండ్రిగారు  పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. 

పాల "గంగరాజు డైరీ" లో..... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు.  గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు.

ఆ రోజుల్లో ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. గంగరాజు సతీమణి సత్యవతి అలా మిగిలిపోయిన పాలతో పాలకోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. ఆ పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 


మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. 

తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి M.G.రామచంద్రన్ 
మరియు మరెందరో ప్రముఖులు  కూడా గంగరాజు పాలకోవా రుచిచూసినవారే.